కాంట్రాక్ట‌ర్ ఇంట్లో దొరికిన క్యాష్ లెక్క తెలిస్తే అవాక్కే!

Update: 2018-07-19 04:28 GMT
ఈ మ‌ధ్య‌న ఎప్పుడైనా బ్యాంకుకు వెళ్లారా?  ఎస్ బీ ఖాతాలో ఉన్న మొత్తంలో రూ.2ల‌క్ష‌లు కావాల‌ని చెక్ రాసిచ్చారా?  ఇలా ఇచ్చి ఉంటే.. స‌మాధానం ఏం వ‌చ్చిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. రూ.2 ల‌క్ష‌ల చెక్ ఇచ్చిన వెంట‌నే.. బ్యాంకులో క్యాష్ లేద‌ని.. గంట‌లో వ‌స్తే సెట్ చేసి ఉంచుతామ‌న్న మాట‌ను చెబుతారు.

నిజానికి ఇలాంటి ప‌రిస్థితి అన్ని బ్యాంకుల్లోనూ ఉంది. గ్రామాల్లో అయితే మ‌రీ దారుణం. ఇక‌.. ప‌ట్ట‌ణాలు హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలోని చాలా బ్యాంకుల్లోని చాలా బ్రాంచుల్లో ఇలాంటి మాట‌నే బ్యాంక్ సిబ్బంది చెబుతారు. మ‌రి.. బ్యాంకుల్లోనే క్యాష్ కోసం ఇంత క‌ట‌క‌ట‌లాడిపోతున్న వేళ‌.. ఒక రోడ్లు వేసే కాంట్రాక్ట‌ర్ ఇంట్లో దొరికిన అవినీతి సొత్తు లెక్క తెలిస్తే నోరు వెళ్ల‌బెట్టాల్సిందే.

నేష‌న‌ల్ హైవేస్ ప‌నుల్లో వేల కోట్ల రూపాయిలు వెన‌కేసుకున్న బ‌డా కాంట్రాక్ట‌ర్ పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆయ‌న పేరు సెయ్యాదురై. వేలాది కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన ఆయ‌న ఇంట్లోనూ.. ఆయ‌న ఇద్ద‌రు కుమారుల్లోనూ పెద్ద ఎత్తున త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. గ‌డిచిన మూడు రోజులుగా ఆయ‌న.. ఆయ‌న కుమారుల ఇళ్ల‌ల్లో ఏక‌ధాటిగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. 

ఇందులో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కూ రూ.215 కోట్ల క్యాష్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇక‌.. బంగారం. వ‌జ్రాలు.. వీవీఐపీ పేర్ల‌తో కూడిన డైరీల‌కు కొద‌వ లేద‌ని చెబుతున్నారు. వీట‌న్నింటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికార అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఇద్ద‌రు మంత్రుల అండ‌దండ‌ల‌తోనే ఇంత భారీగా ఆస్తులు పోగేసిన‌ట్లుగా చెబుతున్నారు.

అన్నాడీఎంకే మంత్రుల అండ‌దండ‌ల‌తో సెయ్యాదురై.. ఆయ‌న‌కు చెంద‌న న‌లుగురు కొడుకులు క‌లిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50 ఇళ్లు.. కార్యాల‌యాల‌పై గ‌డిచిన మూడు రోజులుగా వ‌రుస‌పెట్టి త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా బ‌య‌ట‌కు వ‌స్తున్న ఆస్తిపాస్తుల లెక్క‌ల్ని చూస్తున్న అధికారుల‌కు నోటి వెంట మాట రాని ప‌రిస్థితి. విస్మ‌యానికి గురి చేసేలా బ‌య‌ట‌కు వ‌స్తున్న సంప‌ద ఉంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే రామ‌నాథ‌పురంలోని ఒక ఇంటి గోడ‌లో ర‌హ‌స్య అర‌ను గుర్తించిన అధికారులు వాటిని బ‌ద్ధ‌లు కొట్టారు. అందులో నుంచి విలువైన వ‌జ్రాలు.. ప‌త్రాలు దొరికిన‌ట్లుగా చెబుతున్నారు. మొత్తం 15 బ్యాంకు లాక‌ర్ల‌ను ఇప్ప‌టివ‌ర‌కూ సీజ్ చేశారు. సెయ్యాదురై కుమారుల ఇళ్ల‌ల్లోనే కాదు.. వారి స‌హాయ‌కుల ఇళ్ల‌ల్లోనూ త‌నిఖీలు జ‌రిపిన అధికారుల‌కు సంచుల కొద్దీ డ‌బ్బు మూట‌లు.. బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా లెక్క తేలిస్తే.. మ‌రెన్ని వంద‌ల కోట్ల సంప‌ద అవుతుందో చూడాలి.
Tags:    

Similar News