ఫ్రాన్స్‌ లో మ‌న టీనేజ‌ర్ల అదృశ్యం

Update: 2017-12-30 10:40 GMT

భార‌తీయ విద్యార్థులు ఫ్రాన్స్‌లో అదృశ్య‌మైన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది. పంజాబ్ - హర్యానా - ఢిల్లీ తదితర ప్రాంతాలకు చెందిన 25 మంది మైనర్లు గ‌త సంవ‌త్స‌రం ఫ్రాన్స్ వెళ్ల‌గా ప్ర‌స్తుతం వారిలో 22 మంది ఆచూకి దొర‌క‌డం లేదు. స‌ద‌రు మైన‌ర్ల త‌ల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీబీఐ కేసు నమోదు చేయడంతో పాటుగా ఆ ట్రావెల్ సంస్థ‌ల కార్యాల‌యాల్లో సోదాలు నిర్వ‌హిస్తోంది. మ‌రోవైపు ఇటు సీబీఐ అటు ఇంట‌ర్‌ పోల్ రంగంలోకి ద‌ర్యాప్తు చేస్తున్నాయి.

సీబీఐ ప్రాథ‌మిక ద‌ర్యాప్తు ప్ర‌కారం 13 నుంచి 18 సంవత్సరాల వయసున్న 25 మందిని ఫ్రాన్స్ లో జరిగే రగ్బీ ట్రైనింగ్ క్యాంప్ కోసం ఫరీదాబాద్ లోని లలిత్ డేవిడ్ - ఢిల్లీలోని సంజీవ్ రాయ్ - వరుణ్ చౌదరిలు వీరిని ఫ్రాన్స్ కు పంపారని తేలింది. ఈ ముగ్గురు ట్రావెల్ ఏజంట్ల ద్వారా ఒక్కోక్కరు రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షలు చెల్లించి రగ్బీ కోచింగ్ నిమిత్తం తీసుకెళ్లినట్లు రికార్డుల్లో ఉంది. అయితే వారం రోజుల పాటు రగ్బీ క్యాంపులో పాల్గొన్నారు. ఆ తరువాత ట్రావెల్ ఏజంట్లు వారి రిటర్న్ టికెట్లను క్యాన్సిల్ చేశారని స‌మాచారం. అయితే ఈ క్యాంప్ స‌మ‌యంలో పారిస్‌ లో ఏదో ముప్పును గ‌మ‌నించిన ఇద్ద‌రు ఇండియాకు తిరిగి వ‌చ్చేసిన‌ట్లు స‌మాచారం.

మ‌రోవైపు ఓ యువ‌కుడు ఆ క్యాంప్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌గా....ఫ్రెంచ్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నార‌ని ఇంట‌ర్‌పోల్ ద్వారా సీబీఐకి స‌మాచారం అందింది. మిగిలిన 22 మంది ఆచూకి ప్ర‌స్తుతం ల‌భ్యం కాక‌పోవ‌డంతో...త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న నెల‌కొంది.  సీబీఐ ప్రతినిధి అభిషేక్ దయాల్ ఈ ప‌రిణామంపై స్పందిస్తూ...తాము విద్యార్థుల ఆచూకి గ‌ల్లంతుపై ఫ్రెంచ్ ఫెడ‌రేష‌న్ స‌హా ఇంట‌ర్‌ పోల్‌ తో చ‌ర్చిస్తున్న‌ట్లు వివ‌రించారు.
Tags:    

Similar News