ఎంపీ క‌విత‌కు వ్య‌తిరేకంగా 230 మంది రైతులు

Update: 2019-03-25 17:24 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య‌ - తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌కే కాద‌నే అంచ‌నాలు వెలువడుతున్నాయి. ఎంపీ క‌విత బ‌రిలో దిగిన నిజామాబాద్ లోక్‌ సభ స్థానానికి రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర ఇవ్వడంతో పాటు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ - బోధన్‌ చక్కెర ఫ్యాక్టరీని తెరవాలని కోరుతూ చెరకు రైతులు పార్ల‌మెంటు బ‌రిలో దిగారు. దీంతో నామినేష‌న్లు దాఖ‌లు చేసే సోమ‌వారం సాయంత్రం 3 గంట‌ల వ‌ర‌కు  నిజామాబాద్‌ పార్లమెంట్ స్థానానికి మొత్తం 236 నామినేషన్లు దాఖలయ్యాయి.

నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో పసుపు - ఎర్రజొన్న సాగు చేసే రైతులు ఎక్కువగా ఉన్నారు. వీరంతా తాము సాగు చేసిన పసుపు - ఎర్రజొన్న పంటలకు సరిపడా గిట్టుబాటు ధర రావడం లేదంటూ గత కొన్నేళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. పసుపు - ఎర్రజొన్న - చెరకు పంటలకు మద్దతు ధర కల్పించాలని సుదీర్ఘపోరాటం చేస్తున్న రైతులు... ఎన్నికలను కూడా తమ పోరాటానికి వేదికగా చేసుకున్నారు. తమ సమస్యను జాతీయం చేసేందుకు నిజామాబాద్ ఎంపీ స్థానానికి భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు.నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద నామపత్రాలు దాఖలు చేసేందుకు రైతులు బారులు తీరారు. వీరందరి రాకతో కలెక్టరేట్ ప్రాంగణం నిండిపోయింది. పోలీసులు ముందు జాగ్రత్తగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. నామినేషన్ వేసే వ్యక్తితో పాటు మరో ముగ్గురిని మాత్రమే లోనికి అనుమతించారు.

పసుపు - ఎర్రజొన్న - చెరకు కర్షకులు భారీగా నామినేషన్ వేశారు. ఇవాళ ఒకే రోజు 173 నామినేషన్లు వేశారు. దీంతో నిజామాబాద్‌ పార్లమెంట్ స్థానానికి మొత్తం 236 నామినేషన్లు దాఖలయ్యాయి.  కాగా, 236 అభ్యర్థులు రంగంలోకి ఉంటే.. ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల అధికారులకు సవాల్‌గా మారింది. తొలిదశ ఎన్నికలకు దేశంలోనే అత్యధిక నామినేషన్లు దాఖ‌లైన నియోజ‌క‌వ‌ర్గం నిజామాబాద్ నిలిచింది. వీరంతా బ‌రిలో ఉంటే - బ్యాలెట్‌ రూపంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

ఇదిలాఉండ‌గా,  మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి రంగంలోకి దిగి రైతులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్‌ ఎస్‌ అనుబంధంగా ఉండి గ్రామాల్లో కీలకంగా ఉన్న వ్యక్తులు - రైతులతో శనివారం సమావేశమయ్యారు. 'ఎర్రజొన్న రైతులకు లాభం చేస్తాం. గతంలో కొన్నదాని కంటే రూపాయి ఎక్కువే ఇస్తాం. ఇందుకోసం బోనస్‌ చెల్లిస్తాం. నామినేషన్లు విరమించేలా చూడాలి' అని దిశానిర్దేశం చేశారు. పసుపు పంటకు అవసరమైన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పుతామని చెప్పారు. మంత్రి నిర్వహించిన సమావేశానికి మీడియాను అనుమతించలేదు.
Tags:    

Similar News