24 మంది ఎంపీల‌పై వేటు.. అందుకేనా?

Update: 2019-01-03 05:13 GMT
నిర‌స‌న చేయ‌టం ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తిఒక్క‌రి హ‌క్కు. అయితే.. నిర‌స‌న నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ఉండాలే కానీ.. ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా ఉండ‌కూడ‌దు. అయితే.. ఇందులోనూ కొన్ని మిన‌హాయింపులు వ‌చ్చేశాయి. అధికార‌ప‌క్షానికి అనుకూలంగా.. వారికి ద‌న్నుగా చ‌ట్ట‌స‌భ‌ల్లో ఆందోళ‌న‌లు చేస్తే చూసి.. చూడ‌న‌ట్లుగా ఉండ‌టం ఇప్పుడు స‌భాధ్య‌క్షుల‌కు అల‌వాటుగా మారింద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

ఇలాంటివేళ‌.. లోక్ స‌భ వెల్ లోకి దూసుకొచ్చి ఆందోళ‌న చేస్తున్న తెలంగాణ అధికార‌ప‌క్షం అన్నాడీఎంకేకు చెందిన 24 మంది ఎంపీల‌పై లోక్ స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ వేటు వేయ‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. త‌మిళ‌నాడు రాష్ట్ర స‌ర్కారు డిమాండ్లకు సానుకూలంగా స్పందించాలంటూ స‌భ‌ను అడ్డుకోవ‌టం తంబిల‌కు కొత్తేం కాదు. ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై లోక్ స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంలోనూ ఆ ప‌క్క త‌మిళ తంబిలు.. ఈ ప‌క్క తెలంగాణ అధికార‌ప‌క్ష ఎంపీలు నిర‌స‌న‌లు చేప‌ట్ట‌టం.. హోదా అంశంపై సీరియస్ గా చ‌ర్చ జ‌ర‌గ‌క‌పోవ‌టానికి కార‌ణ‌మ‌వుతుంద‌న్న ఏపీ ఎంపీల విన్న‌పాల్ని లైట్ తీసుకోవ‌టం మ‌ర్చికూడ‌దు.

ఆ సంద‌ర్భంలో అదే ప‌నిగా వెల్ లోకి దూసుకొస్తున్న ఎంపీలపై వేటు వేసేలా లోక్ స‌భ స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకోలేద‌ని.. ఇదంతా మోడీ స‌ర్కారుకు ద‌న్నుగా చేస్తున్న ఆందోళ‌న‌గా అప్ప‌ట్లో ప‌లు వాద‌న‌లు వినిపించాయి. అప్పుడు చ‌ర్య‌లు లేకున్నా.. తాజాగా మాత్రం అన్నాడీఎంకేకు చెందిన ఎంపీల‌పై వేటు వేయ‌టం ఎందుక‌న్న ప్ర‌శ్న‌లు ప‌లువురి మ‌దిని తొలిచేస్తున్నాయి.

రాఫెల్ పై ప్ర‌తిప‌క్షాలు జోరుగా విమ‌ర్శ‌లు చేస్తూ.. మోడీ ప‌రివారానికి ముచ్చ‌మ‌ట‌లు పోయిస్తున్న వేళ‌.. దానిపై ధీటుగా బ‌దులు ఇవ్వ‌టానికి బీజేపీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్న వేళ‌.. స‌భ జ‌ర‌గ‌నీయ‌కుండా.. క‌మ‌ల‌నాథుల మాట ప్ర‌భావ‌వంతంగా బ‌య‌ట‌కు రానివ్వ‌ని వైనం న‌చ్చ‌లేద‌ట్టుంది. అంతే.. తంబిల ఆందోళ‌న హ‌ద్దులు దాటిన‌ట్లుగా గుర్తించిన స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ అన్నాడీఎంకేకు చెందిన 24 మంది ఎంపీల‌పై వేటు వేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. పెళ్లికి.. చావుకి ఒకే మంత్రం ఎలా ఉండ‌దో.. స‌భ‌లో వాతావ‌ర‌ణం.. మోడీ బ్యాచ్ మైండ్ సెట్ ను గుర్తించ‌కుండా రొడ్డు కొట్టుడు టైపులో అదే ప‌నిగా వెల్ లోకి దూసుకెళ్ల‌టం.. నిర‌స‌న‌లు చేస్తే ఇలా వేటు త‌ప్ప‌దు మ‌రి.


Full View


Tags:    

Similar News