24 కొత్త వైరస్ లు కనుగొన్నాంః చైనా శాస్త్రవేత్తలు

Update: 2021-06-13 01:30 GMT
గ‌బ్బిలాల నుంచి తాము కొత్త‌గా 24 ర‌కాల వైర‌స్ ల‌ను క‌నుగొన్నామ‌ని, చైనాలోని శాండాంగ్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. ఇందులో నాలుగు సార్స్‌-కొవ్ 2 వైర‌స్ లు కూడా ఉన్నాయ‌ని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను వారు ఓ మెడిక‌ల్ జ‌ర్న‌ల్ లో ప్ర‌చురించారు.

అడ‌వుల్లోని వివిధ జాతుల గ‌బ్బిలాలను ప‌రిశీలించిన‌ట్టు వారు వెల్ల‌డించారు. గ‌బ్బిలాల మూత్రం, మ‌లం, నోటి నుంచి వ‌చ్చే స్వాబ్ త‌దిత‌రాల‌న్నింటిపై రీసెర్చ్ చేసిన‌ట్టు తెలిపారు. 2019 మే నెల నుంచి 2020 న‌వంబ‌ర్ మ‌ధ్య కూడా ఇదేవిధంగా గ‌బ్బిలాల‌పై ప‌రిశోధ‌న‌లు చేసిన‌ట్టు చెప్పారు.

ఈ గ‌బ్బిలాల ద్వారానే వైర‌స్ మ‌నుషుల‌కు వ్యాపిస్తోంద‌ని తెలిపారు. ప్ర‌ధానంగా సార్స్- కొవ్2 వైర‌స్ కార‌ణంగానే ప్ర‌స్తుత కొవిడ్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌కు కార‌ణ‌మైంద‌ని చైనా శాస్త్ర‌వేత్త‌లు చెప్పుకొచ్చారు. 2020 జూన్ లో థాయ్ లాండ్ నుంచి తెచ్చిన కొన్ని గ‌బ్బిలాలను కూడా ప‌రీక్షించామ‌ని, సార్స్‌-కొవ్2 వైర‌స్ అందులోనూ క‌నిపించింద‌ని తెలిపారు.

అయితే.. చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి వైర‌స్ పుట్టింద‌న్న విమ‌ర్శ‌ల‌ను మాత్రం వారు ఖండించారు. అలాంటిది ఏమీ లేద‌ని, గ‌బ్బిలాల నుంచే క‌రోనా ఉద్భ‌వించింద‌ని చెప్పారు. చైనా ల్యాబ్ నుంచే క‌రోనా బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని ప్ర‌పంచం మొత్తం ఆరోపిస్తున్న వేళ‌.. చైనా ఈ రిపోర్టును బ‌య‌ట పెట్ట‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. వుహాన్ ల్యాబ్ పై ప‌డ్డ మ‌చ్చ‌ను తుడిపేసే ప్ర‌య‌త్నంలో భాగంగానే ఈ కొత్త రిపోర్టును బ‌య‌ట‌పెట్టి ఉండొచ్చ‌నే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
Tags:    

Similar News