అమలాపురం విధ్వంసంలో తాజాగా అరెస్టు చేసిన 25 మంది ఎవరు?

Update: 2022-05-29 03:45 GMT
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. జాతీయస్థాయిలోనూ అందరి చూపు పడేలా చేయటంతోపాటు.. ఏపీ ఇమేజ్ భారీగా డ్యామేజ్ గా మారిన ఉదంతంగా అమలాపురం విధ్వంసకాండను చెప్పాలి. కోనసీమ జిల్లా పేరుకు ముందు అంబేడ్కర్ పేరు పెట్టాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. పెద్ద ఎత్తున ఆందోళన చేయటం.. ఆ సందర్భంగా భారీ విధ్వంసం చోటు చేసుకోవటం తెలిసిందే.

ఇప్పటికే దీనికి బాధ్యులుగా పలువురిని అరెస్టు చేశారు. శనివారం మరో 25 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రిమాండ్ కు తరలించారు. ఈ విధ్వంస కాండలో పాలు పంచుకున్నది మీరంటే మీరని రాజకీయ పార్టీల స్టేట్ మెంట్లు వస్తున్నాయి.

అధికార పార్టీకి చెందిన వారే దీని వెనుక ఉన్నట్లుగా విపక్ష నేతలు ఆరోపిస్తే.. అదేమీ కాదు.. విపక్ష తెలుగుదేశం.. జనసేన పార్టీల కార్యకర్తలే ఉన్నారని వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ.. ప్రచారం చేసింది.

ఇదిలా ఉంటే తాజాగా పోలీసులు అరెస్టు చేసిన 25 మందిలో అత్యధికులు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలుగా చెబుతున్నారు. మొత్తం పాతిక మందిలో పద్దెనిమిది మంది వైసీపీకి చెందిన వారు కాగా.. ఇద్దరు చొపున తెలుగుదేశం.. జనసేన పార్టీకి చెందిన వారిగా చెబుతున్నారు.

మిగిలిన ముగ్గురు సాధారణ పౌరులుగా చెబుతున్నారు. వారికి ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేదని.. వారు ఏ పార్టీకి చెందిన వారు కాదని పోలీసులు గుర్తించారు.

ఇప్పటికే ఈ విధ్వంస కాండకు సంబంధించి పలువురి మీద కేసులు నమోదు చేసి జైలుకు పంపిన అధికారులు.. రానున్న రోజుల్లో మరింత మందిపైనా కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తారని చెబుతున్నారు. తాజాగా అరెస్టు అయిన పాతిక మందిలో 18 మంది వైసీపీకి చెందిన వారన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News