ఏపీలో నిరుద్యోగం నేషనల్ యావరేజికంటే డబుల్

Update: 2019-02-09 13:38 GMT
ఏపీలో బాబు హయాంలో డాబులు తప్ప జాబులు లేవని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. నేషనల్ యావరేజ్ కంటే కూడా ఏపీలో నిరుద్యోగిత ఎక్కువగా ఉందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ‘‘సెంట్ర‌ల్ ఫ‌ర్ మానిట‌రింగ్ ఇండియ‌న్ ఎకాన‌మీ” స‌ర్వే ప్రకారం... డిగ్రీలు, పీజీలు చదివిన లక్షలాది మంది ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్నారని.. ఏపీలో ఈ సమస్య తీవ్రంగా ఉందని తేలింది. గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన నిరుద్యోగుల సంఖ్య ఏపీలో జాతీయ సగటును మించిపోయిందని ఈ అధ్యయనం చెబుతోంది.
    
ఏపీలో పెద్ద‌గా చ‌దువుకోని వారు వివిధ రకాల పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నా డిగ్రీ, అంతకంటే ఎక్కువ చదివినవారు మాత్రం ఉద్యోగాల్లేక ఖాళీగా ఉంటున్నారట. డిగ్రీ, పీజీ చేసిన నిరుద్యోగులు దేశవ్యాప్తంగా 12 శాతం ఉండగా.. ఏపీలో వారి శాతం 25గా ఉంది. అంటే... రాష్ట్రంలో ఈ సమస్య దేశ సగటు కంటే డబుల్ ఉన్నట్లు లెక్క. ఇంకో బాధాకరమైన విషయమేంటంటే... సర్వే సంస్థతో మాట్లాడినవారిలో చాలామంది ఇక తమకు ఉద్యోగం రాదని డిసైడైపోయి ఆ ప్రయత్నాలు కూడా మానుకున్నారట.
    
నిజానికి ఏపీలో 2014 ఎన్నికలకు ముందు బాబు వస్తే జాబు వస్తుందంటూ టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయితే, అధికారంలోకి వచ్చిన తరువాత నియామకాల ఊసే లేదు. ప్రయివేటు రంగాల్లో ఉపాధి కల్పన వనరులు అంతంతమాత్రంగా ఉండడంతో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడే సంస్థలు, పరిశ్రమలు వంటివీ ఆలస్యం కావడంతో ఆ రకంగానూ అవకాశాలు దొరకని పరిస్థితి. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు ఒకటీ అరా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నా ఇంతవరకు నిరుద్యోగ యువతను నిర్లక్ష్యం చేసిందనే చెప్పాలి.
Tags:    

Similar News