ఎన్టీఆర్ ట్రస్ట్ కు 25 ఏళ్ల ప్రస్థానం... చంద్రబాబు అభినందనలు

Update: 2022-02-16 02:30 GMT
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన విశ్వావిఖ్యాత న‌టసార్వ‌భౌముడు, మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త ఎన్టీఆర్ పేరుతో చంద్ర‌బాబుకుటుంబం స్థాపించిన ఎన్టీఆర్ ట్ర‌స్టుకు నేటితో 25 వ‌సంతాలు పూర్త‌య్యాయి.  25 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కు టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజాసేవ పరమావధిగా, స్వర్గీ య ఎన్టీఆర్ ఆశయస్ఫూర్తితో నెలకొల్పిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సమాజసేవలో 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని చంద్రబాబు అన్నారు. అంకిత భావంతో పనిచేస్తోన్న ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బందికి, వాలంటీర్లకు కృతజ్ఞతాభినందనలు తెలిపారు.

ఆరోగ్య సంరక్షణ, విద్య, సాధికారత, జీవనోపాధి రంగాలలో సేవలందించడంతో పాటు ప్రకృతి విపత్తులలో సైతం ప్రజలకు అండగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నిలుస్తోందని చంద్రబాబు అన్నారు. గత నవంబర్ నెలలో వరదల్లో చనిపోయిన వారిలో ఒక్కో కుటుంబానికి 1 లక్ష చొప్పున 48 కుటుంబాలకు రూ.48 లక్షల ఆర్ధిక సాయాన్ని అందించిందని గుర్తు చేశారు.

ఇప్పటివరకు అనేక ప్రకృతి విపత్తులలో ట్రస్ట్ ద్వారా 20,00,000 మందికి పైగా ప్రజలను ఆదుకుందని చంద్రబాబు అన్నారు. రక్తనిధి కేంద్రం, ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుతో చేస్తున్న సేవలను అభినందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు మరింత విస్తృతం అవ్వాలన్న చంద్రబాబు....మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తో పాటు ఉద్యోగులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.

ఇక‌, ఎన్టీఆర్ ట్ర‌స్టు కేవ‌లం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. పొరుగు రాష్ట్రాల్లోనూ సేవ‌లు విస్తృతం చేసింది. పొరుగున ఉన్న త‌మిళ‌నాడులో వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు.. చెన్నైలో ఆహారం స‌ర‌ఫ‌రా చేసింది. తాగునీరు అందించింది. పొరుగు రాష్ట్రాల్లోనూ ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తోంది.

ఇక‌, విద్యార్థుల‌కు అండ‌గా నిలుస్తో్ంది. ముఖ్యంగా విద్యార్థినుల కు అన్ని రూపాల్లోనూ సేవ చేస్తోంది. వారి ఉన్న‌త విద్య‌కు బాధ్య‌త వ‌హిస్తోంది. మ‌ధ్య‌లోనే చ‌దువు ఆపేసే పేద వ‌ర్గాల‌కు చెందిన కుటుంబాల‌ను అక్కున చేర్చుకుని.. వారికి ఉన్న‌త విద్య అందేలా చేస్తోంది.

అదేస‌మ‌యంలో స్కాల‌ర్ షిప్పులు.. పుస్త‌కాలు.. యూనిఫాం ఇలా అనేక రూపాల్లో విద్య‌ను ప్రోత్స‌హిస్తోంది. సొంత‌గా స్కూళ్ల‌ను ఏర్పాటు చేసి పేద కుటుంబాల్లోని విద్యార్థుల‌కు విద్యా దానం చేస్తున్న సంస్థ‌గా ఎన్టీఆర్ ట్ర‌స్టు పేరు తెచ్చుకోవ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News