రాజమండ్రిలోని కోటిలింగాల పుష్కరఘాట్ లో సంభవించిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకరిద్దరి మరణంతో మొదటగా చిన్నదే అనిపించిన ఈ సంఘటన తీవ్రత ఇప్పడిప్పడే అర్థం అవుతోంది. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించిన క్షతగాత్రుల్లో ఇప్పటి వరకూ 26 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చని తెలుస్తోంది.
కోటిలింగాల ఘాట్ లో స్నానం ఆచరిస్తే పుణ్యప్రదం అనే భావనతో ఒక్కసారిగా భక్తులు అంతా ఆ ఘాట్ ను చేరుకొన్నారు. దీంతో తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దాదాపు మూడువందల మంది గాయపడ్డారని సమాచారం. వీరిలో ఇప్పటికే పాతికమంది మృతి చెందారు. క్షతగాత్రుల పరిస్థితిని బట్టి చూస్తే.. ఇది మరింత ఆందోళనకరమైన సంఘటన గా మారుతోంది.
ఇక క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడానికి సరైన ఏర్పాట్లు లేకపోవడం మరో విషాదకరమైన అంశం. లక్షలమంది జనాలు హాజరయిన కార్యక్రమ నేపథ్యంలో కనీసం కొన్ని అంబులెన్స్ లు కూడా అందుబాటులో ఉంచలేదు. దీంతో.. క్షతగాత్రులను తరలించడం కష్టం అయ్యింది. అక్కడికీ వలంటీర్లు.. అధికారుల.. తమ చేతుల మీద ఎత్తుకొని కొంతమందిని వాహనాల వరకూ తరలించిన పరిస్థితి. కోటిలింగాల ఘాట్ లో ఇంతటి దారుణమైన పరిస్థితి ఉన్నా.. మిగతా ఘాట్ లలో మాత్రం పుష్కర స్నానాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.