రోజులో 2 తెలుగు రాష్ట్రాల్లో 3 దారుణాలు.. టాప్ ప్రయార్టీ మాత్రం?

Update: 2022-06-04 02:08 GMT
రోజులో రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు దారుణ ఉదంతాలు చోటు చేసుకున్నాయి. నిజానికి చాలా అరుదుగా జరిగే ఈ మూడు ఉదంతాల్లో ఏ ఒక్కటిని తక్కువ చేయటానికి వీల్లేదు. అయితే.. మీడియా.. సోషల్ మీడియా ఫోకస్ మొత్తం ఒక అంశానికే పరిమితం కావటం గమనార్హం. మూడు దారుణ ఉదంతాలకు శుక్రవారం సాక్ష్యంగా నిలిచింది. శుక్రవారం ఉదయం ఒక ఆంగ్ల పత్రిక.. ఒక తెలుగు పత్రికలో వచ్చిన ఒక వార్త చాలామందిని ఆకర్షించింది. అదే.. హైదరాబాద్ లో పబ్ లో పరిచయమైన అమ్మాయిని ఐదుగురు కుర్రాళ్లు అత్యాచారానికి పాల్పడిన ఉదంతం. ఈ వైనం మధ్యాహ్నానానికి జాతీయ మీడియాలో సైతం ప్రముఖంగా రావటం.. అందరి ఫోకస్ దాని మీదకు వెళ్లింది.

దీంతో.. మీడియాలోనూ.. టీవీ చానళ్లలోనూ.. సోషల్ మీడియాలోనూ ఈ వార్తకు వచ్చినంత ప్రాధాన్యత మిగిలిన రెండింటికి దక్కలేదనే చెప్పాలి. ఇక.. రెండో ఘటన శుక్రవారం మధ్యాహ్నం కర్ణాటకలో చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన రెండు కుటుంబాల వారు పుట్టినరోజు వేడుక కోసం గోవాకు ఆరెంజ్ ట్రావెల్ బస్సులో బయలుదేరి వెళ్లారు.

తిరిగి వచ్చే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు కల్వర్టులోకి జారి పడింది. దీంతో డీజిల్ ట్యాంక్ పేలిపోయి బస్సు బుగ్గైంది. దీంతో బస్సులో ప్రయాణించిన వారిలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఉదంతం ఉదయం 11 గంటలకు బయటకు వచ్చినా.. దాని వివరాలు వచ్చేసరికి మధ్యాహ్నం 12 గంటలైంది. ఆ తర్వాత కొద్ది గంటలు ఈ ఉదంతం మీద ఫోకస్ టీవీ ఛానళ్లు పెట్టినా.. తర్వాత మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఉదంతానికి ప్రాధాన్యతను ఇచ్చారు.

ఈ ఉదంతంలో పలువురు రాజకీయ నేతల పుత్రరత్నాల ప్రమేయం ఉందన్న ఆరోపణలే దీనికి కారణం. దీనికి తోడు రాజకీయ రగడ కూడా తోడు కావటంతో ఈ ఉదంతానికి భారీ ప్రాధాన్యత దక్కింది. వాస్తవానికి ఈ దారుణం మే 28న జరిగితే.. బాధితురాలి తండ్రి మే 31న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు మీడియా సంస్థల్లో వచ్చిన వార్తల్ని చూసి టీవీ చానళ్లు ఈ అంశానికి భారీ ప్రాధాన్యతను ఇవ్వటంతో కొద్ది గంటల్లోనే జాతీయ స్థాయిలో ప్రాధాన్యత లభించింది.

ఇదిలా ఉంటే.. ఇదే సమయంలో అంటే శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల వేళలో  అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో సీడ్స్ వస్త్ర పరిశ్రమ నుంచి వెలువడిన విషవాయువుతో వందల మంది తీవ్ర అవస్థలకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అయ్యాయి. వారి వెతలు చూసినోళ్లంతా ఆందోళనకు గురయ్యారు.

లీకైన విష వాయువులుబయట వాతావరణంలోకి వ్యాపించటంతో అక్కడి సమీప ప్రాంతాల్లోని వారు శ్వాస తీసుకోవటం కష్టంగా మారింది. కొందరు వాంతులు చేసుకోగా.. మరికొందరు స్ప్రహ తప్పి పడిపోయారు. అయితే.. టీవీ చానళ్లలో ఈ ఉదంతానికి పెద్దగా ప్రాధాన్యత లభించని పరిస్థితి. నిజానికి ఈ ఉదంతంలో పలువురి గర్భిణిలు అయితే నరకాన్ని చవి చూశారు. పగోళ్లకు కూడా ఈ టార్చర్ వద్దురా? అన్నట్లుగా అక్కడి పరిస్థితి నెలకొంది. ఇలా మూడు  సంచలన ఉదంతాలు.. దారుణాలు చోటు చేసుకుంటే.. కారులో గ్యాంగ్ రేప్ కు మాత్రమే అత్యధిక ప్రాధాన్యత లభించటం గమనార్హం.
Tags:    

Similar News