మూడు ప్రాజెక్టుల‌కు మోడీ శంకుస్థాప‌న‌... ప్ర‌యోజ‌నాలు ఇవే

Update: 2019-02-10 09:22 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఏపీ ప‌ర్య‌ట‌న పూర్త‌యింది. ఆదివారం ప్రధాని మోడీ నేడు ఏపీ పర్యటనకు విచ్చేశారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి తెలుగు రాష్ర్టాల గవర్నర్‌ నరసింహన్‌, ఆ రాష్ట్ర సీఎస్‌, డీజీపీలు స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌ ద్వారా ప్రధాని సభావేదిక గుంటూరుకు చేరుకున్నారు. చమురు నిల్వలకు సంబంధించి మూడు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ శ్రీకారం చుట్టారు. సభావేదిక నుంచి రిమోట్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రారంభించారు. విశాఖ‌లో రూ.1178 కోట్లతో నిర్మించిన  వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. కృష్ణపట్నం పోర్టు వద్ద రూ.700 కోట్లతో నిర్మించిన బీపీసీఎల్‌ టర్మినల్‌ శంకుస్థాపన చేశారు. అమలాపురం వద్ద ఓఎన్‌జీసీ వశిష్ట, ఎస్1 ఆన్‌షోర్‌ ప్రాజెక్టును రిమోట్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా గుంటూరును అభినందిస్తూ మోడీ ప్ర‌సంగం సాగింది. ‘ఏపీ అక్షర క్రమంలో తొలిస్థానంతో పాటు అన్ని రంగాలలో, అంశాలలో అగ్రగాములైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు, పద్మభూషణ్, దళిత కవి గుర్రం జాషువా, మహాకవి తిక్కన జన్మించిన గుంటూరు ప్రజలకు నమస్కారం...’  అంటూ ప్రధానమంత్రి  తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

కాగా, వశిష్ట ప్రాజెక్టు ద్వారా 9 ఏళ్లలో 9.58 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల చమురును వెలికితీయనున్నారు. డాల్ఫిన్‌ నోస్‌ కొండలో ఏర్పాటు చేసిన భూగర్భ చమురు నిల్వ కేంద్రాన్ని కేంద్ర ఇంధన, సహజవాయు మంత్రిత్వశాఖ రూ. 1178 కోట్లతో నిర్మించింది. కేంద్ర ఇంధన, సహజ వాయువులు, ఇంజినీరింగ్‌ మంత్రిత్వశాఖ,  ఐఎస్‌పీఆర్‌ఎల్‌, ఓఐడీబీలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టుని చేపట్టాయి. ఈ చమురు నిల్వ కేంద్రం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లోని రిఫైనరీలకు పైపులైన్లు, నౌకల్లో సరఫరా అవుతుంది.

దేశంలోని మూడో అతిపెద్ద చమురు కంపెనీల్లో ఒకటైన భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ సంస్థ కృష్ణపట్నంలో చమురు సమీకరణ, నిల్వ, పంపిణీల కోసం ప్రత్యేక టెర్మినల్‌ను 100 ఎకరాల స్థలంలో కృష్ణపట్నంలో రూ.700 కోట్లు అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తోంది. మోటార్‌ స్పిరిట్‌, ఇథనాల్‌, హైస్పీడ్‌ డీజిల్‌, బయో డీజిల్‌ను ఇక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు ఈ  పెట్రో కోస్టల్‌ టెర్మినల్ ద్వారా సరఫరా చేయనున్నారు. అమలాపురం సమీపంలోని తీరప్రాంతంలో ఏర్పాటైన బావుల నుంచి చమురు వెలికి తీసేదే గ్యాస్ ఫీల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు. రూ.5,300 కోట్ల పెట్టుబ‌డితో తొమ్మిదేళ్లలో 9.58 బిలియన్‌ క్యూబిక్ మీటర్ల చమురును ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. కేజీ బేసిన్‌లోని ఓఎన్‌జీసీ నిర్వహిస్తున్న వశిష్ట ఎస్1 బావి నుంచి చమురుని వెలికితీసేందుకు ఆఫ్‌షోర్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు ఉద్దేశించింది.
Tags:    

Similar News