అగ్ర‌రాజ్యంపై వార్ కోసం 30ల‌క్ష‌ల మంది త‌యార్‌

Update: 2017-08-14 07:58 GMT
ఏం పోయే కాల‌మో అర్థం కాదు. చూస్తూ.. చూస్తూ అగ్ర‌రాజ్య‌మైన అమెరికాను దెబ్బ తీయాల‌న్న ఆలోచ‌న‌ను త‌ల‌కెక్కించుకున్న ఉత్త‌ర కొరియా నియంత పుణ్య‌మా అని ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. పిచ్చాడి చేతిలో రాయి మాదిరి కొన్ని అణ్వ‌స్త్రాల్ని చేతిలోకి పెట్టుకున్న ఉత్త‌ర‌కొరియా నియంత కిమ్.. అమెరికా మీద త‌ర‌చూ యుద్ధం చే్స్తాన‌ని చెప్ప‌టం.. ఈ మాట‌ల‌కు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ తీవ్ర‌స్థాయిలో స్పందించ‌టం తెలిసిందే.

గ‌డిచిన కొద్ది నెల‌లుగా ద‌శ‌ల వారీగా ఉత్త‌ర‌కొరియా.. అమెరికాల మ‌ధ్య న‌డుస్తున్న మాట‌ల యుద్ధం ఇప్పుడు..యుద్ధం దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయా? అన్న సందేహానికి గురి చేసేలా ప‌రిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అమెరికాతో యుద్ధం కోసం దాదాపు 30 ల‌క్ష‌ల మంది ఉత్త‌ర‌కొరియ‌న్లు త‌మ‌కు తాముగా ముందుకు వ‌చ్చిన‌ట్లుగా ఆ దేశ మీడియా పేర్కొన‌టం గ‌మ‌నార్హం.

ఉత్త‌ర కొరియా దూకుడుకు క‌ళ్లాలు వేసేలా ట్రంప్ భారీ హెచ్చ‌రికలు జారీ చేశారు. అయిన‌ప్ప‌టికీ కిమ్ మాత్రం ఖాత‌రు చేయ‌టం లేదు. తన ముకుంప‌ట్టు వీడ‌ని అత‌డు మ‌రోసారి క్షిప‌ణి ప్ర‌యోగానికి సిద్ధ‌మైన‌ట్లుగా అక్క‌డి ఛాన‌ల్ వెల్ల‌డించింది. ఇప్ప‌టివ‌ర‌కూ ఖండాంత‌ర క్షిప‌ణుల ప్ర‌యోగాలు చేప‌ట్టిన కిమ్‌.. ఇక‌పై జ‌లాంత‌ర్గామి ఆధారిత బాలిస్టిక్ క్షిప‌ణి ప్ర‌యోగాలు చేప‌ట్ట‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు.

అమెరికాను ఏదో చేసేయాల‌న్న ల‌క్ష్యంతో ఇప్ప‌టివ‌ర‌కూ 11 క్షిప‌ణి ప్ర‌యోగాల్ని చేప‌ట్టిన ఉత్త‌ర‌కొరియా.. ఒక్క జులై లోనే మూడు ప్ర‌యోగాలు చేప‌ట్టి ఉద్రిక్త‌త‌ల్ని పీక్స్‌కు తీసుకెళ్లింది. చివ‌ర‌కు అమెరికా స్వాతంత్ర్య దినోత్స‌వం రోజున కూడా బాలిస్టిక్ క్షిప‌ణి ప్ర‌యోగం జ‌రిపి త‌న తీరును ప్ర‌పంచానికి చాటేలా చేసింది. ఇది అమెరికాకు ఒళ్లు మండేలా చేసింది.  ఇదిలా ఉండ‌గా.. ప‌సిఫిక్ మ‌హాస‌ముద్రంలోని అమెరికా అధీనంలో ఉన్న గువాం ద్వీపంపై అణుదాడి చేస్తామ‌ని ఉత్త‌ర‌కొరియా ప్ర‌క‌టించ‌టంతో తాజాగా ఉద్రిక్త‌లు మ‌ళ్లీ మొద‌ల‌య్యాయి. ఉత్త‌ర‌కొరియా ప్ర‌క‌ట‌న‌ల‌కు తీవ్రంగా స్పందించిన ట్రంప్‌.. ప్ర‌పంచ ప‌టంలో ఉత్త‌ర‌కొరియా అన్న‌ది లేకుండా చేస్తామ‌న్న భీక‌ర వ్యాఖ్య చేశారు. ఇలాంటి వేళ‌లోనే.. అమెరికాపై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగా భారీ ఎత్తున సైన్యాన్ని మొహ‌రిస్తున్న తీరు.. యుద్ధ‌మేఘాల్ని ద‌ట్టంగా క‌మ్మేలా చేస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News