ఉద్యోగులు అమరావతికి వెళ్లరా?

Update: 2015-08-15 11:07 GMT
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచే పరిపాలనను కొనసాగించాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవా? ఇన్నాళ్లు భవనాల కొరత సమస్య వేధిస్తే...దానికి పరిష్కారం కనుగొన్న బాబు సర్కారకు కొత్త తిప్పలు మొదలయ్యాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలకు చెందిన సీనియర్ నాయకులు తమ వాదనను వివరిస్తున్నారు.

హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు వారి కుటుంబాలతో సహా వెంటనే అమరావతికి తరలి వెళ్లడానికి రాజ్యాంగంలోని 371డి అధికరణం అడ్డుపడుతోంది. ప్రతి ప్రాంతపు స్ధానిక హక్కులను కాపాడటానికి ఈ ఆర్టికల్ ని రూపొందించారు. దీని ప్రకారం విద్యావకాశాల్లో స్ధానికులకు 85 శాతం,  స్ధానికేతరులకు 15 శాతం సీట్లు లభిస్తాయి. హైదరాబాద్ లో పనిచేస్తున్న దాదాపు 50 వేలమంది ఏపీ ఉద్యోగులు అమరావతికి తరలిరావాలంటే వారి పిల్లలకు స్ధానికత అంశం అడ్డుపడుతోంది. కేవలం 15 శాతం కోటాలో పోటీ పడకతప్పని పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు.

1969 లో తెలంగాణా ఉద్యమం,1972 లో జై ఆంధ్రా ఉద్యమాల తరువాత స్ధానిక,స్ధానికేతర వివాదాలకు పరిష్కారంగా రాజ్యాంగంలో 32 వ సవరణగా 371డి ఆర్టికల్ ని 1974లో చేర్చారు.ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే వర్తిస్తుంది. ఇపుడు ఆ ఆంధ్రప్రదేశే లేదు కాబట్టి ఉద్యోగుల పిల్లలకు స్ధానిక సమస్య తలెత్తినందున 371డిని పూర్తిగా రద్దు కూడా చేయవచ్చు. అయితే 371డీకి సవరణలు తేవటమన్నది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. దీన్ని సవరించాలన్నా, పూర్తిగా రద్దు చేయాలన్నా అధికారం ఒక్క రాష్ర్టపతికి మాత్రమే ఉంది. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి సవరణలు చేసి రాష్టప్రతికి పంపవచ్చు లేదా రద్దు చేయాలంటూ కేంద్ర క్యాబినెట్‌ సిఫారసు కూడా చేయవచ్చు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తవ్వటానికి కొంత వ్యవధి తప్పనిసరి.

పిల్లల చదువులు, ఇతరత్రా అంశాలకు సంబంధించి 371డి అడ్డుపడుతోందని  ఉద్యోగ సంఘాలు మొదటి నుంచీ చెబుతూనే వున్నా ఇందులో వున్న సంక్లిష్టత ఇపుడే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో పడిందని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రక్రియను వీలైనంత త్వరలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం.

మొత్తంగా ముఖ్యమంత్రీ, ఛీఫ్ సెక్రెటరీ విజయవాడలో క్యాంప్ ఆఫీసులు పెట్టినంత ఈజీగా హైదరాబాద్ నుంచి ఉద్యోగులు అమరావతి తరలిపోవడం సాధ్యం కాదు. అయితే ఈలోగా ఆంధ్రప్రదేశ్ పాలనా వ్యవహారాలు మందగించకుండా కృష్ణా, గుంటూరు జిల్లాల ఉద్యోగులను ఉపయోగించుకోవచ్చను అనే సూచన ఉద్యోగ సంఘాల నుంచి వినిపిస్తోంది. ఈ రెండు జిల్లాల్లోనూ 60 వేలమంది ప్రభుత్వోగులు వున్నారు. వీరిలో సగం మందిని హైదరాబాద్ నుంచి ఉద్యోగులు వచ్చేవరకూ అమరావతి పరిధిలో ఏర్పాటు చేసే సెక్రటేరియట్ కు డెప్యుటేషన్ మీద పంపవచ్చని ఉద్యోగసంఘాల నాయకులు వివరిస్తున్నారు.
Tags:    

Similar News