అమరావతిలో టీడీపీ ఆఫీసుకు భూమి కావాలంట

Update: 2016-01-24 05:37 GMT
ఏపీ రాజధాని అమరావతిలో పార్టీ కార్యాలయం ఏర్పాటు కోసం అధికార తెలుగుదేశం పార్టీ 4 ఎకరాల భూమి కోసం దరఖాస్తు చేసింది. పార్టీ కార్యకలాపాల కోసం నాలుగు ఎకరాల భూమిని కేటాయించాలంటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు దరఖాస్తు చేయటం సరికొత్త చర్చకు తెర తీసింది. ఏపీ రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర రాజధాని కోసం అమరావతిని ఎంపిక చేయటం తెలిసిందే.

అదికార టీడీపీతో సహా.. ఏ పార్టీ ప్రధాన కార్యాలయం ఏపీ రాజధానిప్రాంతంలో లేదు. తాజా పరిస్థితుల్లో ఈ వ్యవహారం ఏపీ రాజకీయ పార్టీలకు ఇబ్బందిగా మారింది. ఇంతకాలం హైదరాబాద్ రాజధానిగా ఉండటంతో ప్రతి పార్టీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లోనే ఉండేది. విభజన నేపథ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి ప్రధాన కార్యాలయ ఏర్పాటుకు స్థలం సమస్యలు ఉంటాయి. అధికారపార్టీ నాలుగు ఎకరాల స్థలం ప్రభుత్వాన్ని అడుగుతున్న నేపథ్యంలో.. మిగిలిన పార్టీలు అదే బాట పట్టొచ్చు. అంతకంటే ముందు.. ఏపీ సర్కారు అన్ని ప్రధాన రాజకీయ పక్షాలతో భేటీ ఏర్పాటు చేసి.. రాజకీయ పార్టీల ప్రధాన కార్యాలయాల కోసం భూమి ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

అయితే.. ఇలా చేయటం నిబంధనలకు విరుద్ధమని వాదించే వారు లేకపోలేదు. అయితే.. నిబంధనలు అంటూ విపక్షాలను దూరంగా పెట్టటం కంటే.. అధికార పార్టీ ప్రధాన కార్యాలయం కోసం కేటాయించే భూమి వివాదాస్పదం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే.. ఏపీరాజధాని ప్రత్యేక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని అన్ని రాజకీయ పార్టీలకు కొంత భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. దీనిపై బాబు ఏమంటారో..?
Tags:    

Similar News