దేశంలో 4కోట్ల పాత వాహనాలు..హరిత పన్ను విధిస్తుందా?

Update: 2021-03-29 08:05 GMT
దేశవ్యాప్తంగా 4కోట్ల పాత వాహనాలు రహదారులపై తిరుగుతున్నట్లు లెక్క తేలింది. వీటిలో సగానికి పైగా ఇరవైయేళ్ల పైబడినవి ఉంటాయని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. హరిత పన్ను విధానికి కేంద్రం తెరలేపిన నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ ఈ వివరాలను డిజిటలైజ్ చేసింది.

తెలుగు రాష్ట్రాల లెక్క తేలలేదు
దాదాపు 70 లక్షలకు పైగా పాత వాహనాలు కర్ణాటకలో ఉన్నాయి. 56.54 లక్షలతో ఉత్తర ప్రదేశ్ రెండో స్థానంలో, 49.93 లక్షల వాహనాలతో దేశ రాజధాని దిల్లీ మూడో స్థానంలో ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, లక్ష్యద్వీప్ ల పాత వాహనాల వివరాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ నివేదికలో పొందుపర్చలేదు.

పర్యావరణం కోసమే..
15 ఏళ్లు పైబడిన వాహనాలను పాతవాటిగా పరిగణిస్తారు. ఈ వాహనాలతో పర్యావరణంపై ఎక్కువ ప్రభావం పడుతుంది. కాలుష్యాన్ని తగ్గించే విధంగా ఈ పాత వాహనాల వినియోగాన్ని క్రమంగా తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. ఫలితంగా హరిత పన్ను విధానాన్ని అమలును తీసుకొచ్చింది. ఇలాంటి పాత వాహనాలపై పన్ను విధించనున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపినట్లు సమాచారం.

వాటికి మినహాయింపు
హరిత పన్ను ద్వారా వసూలు అయ్యే ఆదాయంతో కాలుష్యాన్ని తగ్గించడానికే ఖర్చు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. హైబ్రిడ్, విద్యుత్, సీఎన్ జీ, ఇథనాల్, ఎల్ పీజీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలకు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లు, హార్వెస్టర్లకూ మినహాయింపు ఉంటుందని తెలిపింది.
Tags:    

Similar News