లెక్క తేలుతోంది: న‌ల్ల‌ధ‌నం..4ల‌క్ష‌ల కోట్లు!

Update: 2017-01-11 05:59 GMT
పెద్దనోట్ల రద్దు సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయమేనని రుజువు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. రాజకీయ నాయకుల మొదలు ఆర్థిక నిపుణుల వరకు ఈ నిర్ణయాన్ని విమర్శిస్తున్న నేపథ్యంలో ఇది ఆశించినట్టుగా సత్ఫలితాలనే ఇచ్చిందని గణాంకాలతో సహా వివరాలను వెల్లడించడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సిద్ధమవుతున్నది. ఇప్పటివరకు బ్యాంకుల నుంచి అందిన వివరాలను విశ్లేషించే పనిలో ఆదాయం పన్ను శాఖ నిమగ్నమైంది. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన బ్యాంకు ఖాతాలతోపాటు ఇప్పటివరకూ వినియోగంలో లేకుండా నోట్ల రద్దు తర్వాత హఠాత్తుగా ఆ ఖాతాల్లోకి వచ్చి చేరిన డబ్బును - రెండు లక్షల రూపాయలకంటే ఎక్కువ జమ అయిన ఖాతాలను - పాన్ నంబర్ లేకుండా యాభై వేల రూపాయల కంటే ఎక్కువ నగదు జమ చేసిన ఖాతాలను.. ఇలా పలు కోణాల నుంచి ఐటీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.

దేశవ్యాప్తంగా సుమారు 60 లక్షల బ్యాంకు ఖాతాల్లో ఒక్కో దాంట్లో రూ.2 లక్షలకంటే ఎక్కువ నగదు జమ అయిందని, మొత్తంగా ఈ ఖాతాల్లోకి రూ.7.43 లక్షల కోట్లు విలువ చేసే రద్దయిన నోట్లు బ్యాంకుల్లోకి వచ్చి చేరాయని ఆదాయ పన్నుశాఖ అధికారులు చెప్తున్నారు. ఇందులో ఎంతలేదన్నా మూడు లక్షల కోట్ల నుంచి గరిష్ఠంగా నాలుగు లక్షల కోట్ల వరకు పన్ను చెల్లించకుండా ఉన్న డబ్బే అయి ఉండవచ్చని అధికారుల అంచనా. అందువల్లనే గ్రామీణ బ్యాంకుల మొదలు సహకార బ్యాంకులు, ఈశాన్య రాష్ట్రాల్లోని బ్యాంకులు, జన్‌ధన్ యోజన ఖాతాలు తదితరాలన్నింటినీ విశ్లేషించే పనిలో ఐటీ అధికారులు నిమగ్నమయ్యారు. ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనులకు ఆదాయం పన్ను నుంచి మినహాయింపు ఉండడంతో వారి ఖాతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈశాన్య ప్రాంత‌ సామాన్య ప్రజల బ్యాంకు ఖాతాల్లో రూ.10,700 కోట్ల విలువైన పాత నోట్లు జమ అయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇంతకాలం కదలిక లేకుండా ఉన్న బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ.25వేల కోట్లు జమ కావడం, ఒక్కసారిగా సుమారు రూ.80 వేల కోట్ల మేరకు వివిధ రకాల రుణాలకు చెల్లింపు జరుపడం, ఒకే పాన్ నంబర్, మొబైల్ నంబర్, చిరునామాలతో ఉన్న బ్యాంకు ఖాతాల్లో నలభై వేల కోట్ల రూపాయలకంటే ఎక్కువ జమ కావడం, ఒకే ఖాతాలో రెండు లక్షల కంటే ఎక్కువ డబ్బు ఈ యాభై రోజుల వ్యవధిలో వచ్చి చేరడం.. ఇలాంటి వాటన్నింటినీ విశ్లేషించే ప్రక్రియ జరుగుతూ ఉంది.

కాగా...ఒక్కసారిగా బ్యాంకు ఖాతాల్లోకి పెద్దమొత్తంలో వచ్చి చేరిన డబ్బుకు తగిన వివరాలను వెల్లడించాలని కోరుతూ ఐటీ అధికారులు సంబంధిత ఖాతాదారులకు నోటీసులు పంపడం కూడా మొదలైందని తెలుస్తోంది. ఒక్కో బ్యాంకు ఖాతాలో ఆదాయపు పన్ను పరిధిలోకి రాకుండా గరిష్ఠంగా రూ.2.5 లక్షల వరకు జమ చేసుకునే వెసులుబాటు ఉన్నా, ఇప్పటివరకూ అంత మొత్తంలో జమ కాకుండా కేవలం నోట్ల రద్దు తర్వాతే ఎలా డిపాజిట్లు అయ్యాయనేదానిపై కూడా ఐటీ అధికారులు ఆరా తీయనున్నారు. దీనిపై సంతృప్తికర సమాధానాలు రానిపక్షంలో తీసుకోవాల్సిన చర్యలపై కూడా త్వరలో ఐటీ శాఖ దృష్టి సారించనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News