భారత ప్రధాని మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొంత కాలంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోన్న సంగతి తెలిసిందే. నేడు మోదీ సర్కార్ నాలుగేళ్ల పాలన సందర్భంగా రాహుల్ మరోసారి మోదీపై విమర్శలు గుప్పించారు. మోదీ నాలుగేళ్ల పాలనపై రాహుల్ గాంధీ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. మోదీ పాలనకు రాహుల్ చమత్కార ధోరణిలో ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు. నాలుగేళ్ల కాలంలో మోదీ దేశవ్యాప్తంగా అనేక సంస్కరణలు చేపట్టారని, ఆయన హయాంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఎద్దేవా చేశారు. పెద్ద నోట్ట రద్దు - జీఎస్టీ...వంటి సంస్కరణలు చేపట్టడం వల్ల పేదవారి జీవితాలను అతలాకుతలం చేసిన ఘనత మోదీదేనంటూ సెటైర్ వేశారు. ఏటీఎంల ముందు జనాలు క్యూలైన్లలో బారులు తీరేలా చేసిన ఘనతకూడా ఆయనకు దక్కిందంటూ ఎద్దేవా చేశారు. నేషనల్ హెల్త్ స్కీమ్ ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి రాలేదంటూ చమత్కరించారు. మోదీకి మార్కులు వేస్తూ రాహుల్ ఓ ప్రోగ్రెస్ కార్డును రూపొందించి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ప్రోగ్రెస్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
నాలుగేళ్ల మోదీ పాలనకు ప్రోగ్రెస్ కార్డు
వ్యవసాయం: ఫెయిల్
పెట్రో ధరలు: ఫెయిల్
ఉపాధి కల్పన: ఫెయిల్
విదేశాంగ విధానం: ఫెయిల్
నినాదాలు సృష్టించడం: ఏ ప్లస్
సొంతడబ్బా కొట్టుకోవడం: ఏ ప్లస్
యోగా:బీ మైనస్