భారత్ కు 40 దేశాల సహాయం.. ఏం అందిస్తున్నాయో తెలుసా?

Update: 2021-05-01 14:30 GMT
ఇండియాలో ఒక్క రోజు న‌మోదయ్యే కేసుల సంఖ్య 4 ల‌క్ష‌ల మార్కును దాటేసింది. ఆసుప‌త్రుల‌న్నీ రోగుల‌తో నిండిపోతే.. శ్మ‌శానాలు శ‌వాల‌తో నిండిపోతున్నాయి. ఇలాంటి విల‌యం ప్ర‌పంచంలో ఏ దేశంలోనూ న‌మోదు కాలేదు. దీంతో.. ప్ర‌పంచ దేశాల‌న్నీ మాన‌వ‌తా దృక్ప‌థంతో భార‌త్ కు స‌హాయం అందించేందుకు ముందుకు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే సుమారు 40 దేశాలు త‌మ వంతు స‌హ‌కారం అందిస్తామ‌ని ప్ర‌క‌టించాయి. ఇప్ప‌టికే కొన్ని దేశాల స‌హాయం అందుతోంది.

అయితే.. ఈ క‌రోనా మ‌హ‌మ్మారి దేశంపై ఎంత‌టి ప్ర‌భావం చూపిందంటే.. దేశ విదేశాంగ విధానాన్నే మార్చాల్సిన ప‌రిస్థితిని తెచ్చి పెట్టింది. చాలా మందికి గుర్తుండే ఉంటుంది.. 2018లో కేర‌ళ‌ను బీభ‌త్స‌మైన వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. దేశీయంగా ఎవ‌రికి తోచిన స‌హాయం వారు చేశారు. అయితే.. విదేశాలు కూడా ముందుకొచ్చాయి. ఇందులో భాగంగా యూఏఈ రూ.700 కోట్ల ఆర్థిక స‌హాయం అందిస్తామ‌ని ప్ర‌క‌టించింద‌ని కేర‌ళ ప్ర‌భుత్వం తెలిపింది. కానీ.. కేంద్రం ఆ స‌హాయం తీసుకోవ‌డానికి అంగీక‌రించ‌లేదు. దీనికి కార‌ణం ఏమంటే.. 2004లో రూపొందించుకున్న విదేశాంగ విధాన‌మే.

ఎలాంటి స‌మ‌స్య‌నైనా సొంతంగా ఎద‌ర్కోవాల‌నే ఉద్దేశంతో.. అప్ప‌టి కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. విప‌త్తుల స‌మ‌యంలో విదేశీ స‌హాయాన్ని తీసుకోవ‌ద్ద‌ని నిర్ణ‌యించింది. అప్ప‌టి నుంచి ఎలాంటి విప‌త్తులు ఎదురైనా.. ఏ ఒక్క దేశం నుంచీ స‌హాయం తీసుకోవ‌ట్లేదు భార‌త్‌. కానీ.. క‌రోనా అంతా త‌ల‌కిందులు చేసింది. ప్ర‌పంచంలో ఏ దేశంలో చోటు చేసుకోన‌టువంటి విప‌త్తు.. ఇండియాలో మొద‌లైంది. కేవ‌లం ఊపిరి అంద‌క వేలాది మంది ప్రాణాలు కోల్పోయే దారుణ ప‌రిస్థితి వ‌చ్చింది. మందుల కొర‌త వేధిస్తోంది. వ్యాక్సిన్ స‌కాలంలో అంద‌రికీ అంద‌ట్లేదు.

ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌పంచం మొత్తం స‌హాయం అందించేందుకు ముందుకు వ‌చ్చింది. ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితుల్లో.. భార‌త్ అనివార్యంగా 16 సంవ‌త్స‌రాల నాటి విధానాన్ని ప‌క్క‌న పెట్టాల్సి వ‌చ్చింది. అమెరికా నుంచి రుమేనియా దాకా చేత‌నైన స‌హాయం చేసేందుకు సిద్ధ‌మ‌య్యాయి. ఆయా దేశాలు ఏమేం అందిస్తున్నాయంటే...

అమెరికాః  1700 ఆక్సీజ‌న్ కాన్స‌న్ట్రేట‌ర్స్, 1100 సిలిండ‌ర్లు, ఆక్సీజ‌న్ ఉత్ప‌త్తి యూనిట్లు
హాంకాంగ్ః 800 ఆక్జీజ‌న్ కాన్సన్ట్రేట‌ర్స్
ఐర్లాండ్ః 700 ఆక్జీజ‌న్ కాన్సన్ట్రేట‌ర్స్
రుమేనియాః 80 ఆక్జీజ‌న్ కాన్సన్ట్రేట‌ర్స్, 75 ఆక్సీజ‌న్ సిలిండ‌ర్లు
ర‌ష్యాః 20 ఆక్జీజ‌న్ కాన్సన్ట్రేట‌ర్స్
సౌదీ అరేబియాః 250 ఆక్జీజ‌న్ కాన్సన్ట్రేట‌ర్స్, 4 క్ర‌యోజెనిక్ ఆక్సీజ‌న్ కంటైన‌ర్లు, 80 మెట్రిక్ ట‌న్నుల లిక్విడ్ ఆక్సీజ‌న్‌
ఫ్రాన్స్ః 5 లిక్విడ్ మెడిక‌ల్ ఆక్సీజ‌న్ కంటైన‌ర్లు
యుఏఈః 6 క్ర‌యోజ‌నిక్ ఆక్సీజ‌న్ కంటెయిన‌ర్లు
జ‌ర్మ‌నీః ఆక్సీజ‌న్ ఉత్ప‌త్తి క‌ర్మాగారం (మూడు నెల‌ల పాటు ప‌నిచేస్తుంది)
పోర్చుగల్ః 20,000 లీట‌ర్ల లిక్విడ్ ఆక్సీజ‌న్‌
థాయ్ లాండ్ః 4 క్ర‌యోజెనిక్ ఆక్సీజ‌న్ ట్యాంకులు
బ్రిటన్ః 120 ఆక్జీజ‌న్ కాన్సన్ట్రేట‌ర్స్ (రెండో ద‌శ‌లో)

ఇంకా.. ఈ దేశాల నుంచే కోట్లాది మాస్కులు, మందులు, వంద‌ల‌ సంఖ్య‌లో వెంటిలేట‌ర్లు అంద‌నున్నాయి. ఇందులో ఇప్ప‌టికే కొన్ని ఇండియా చేరాయి కూడా.
Tags:    

Similar News