క్లైమాక్సు కొచ్చిన తమిళ పొలిటికల్ మూవీ

Update: 2017-02-09 07:34 GMT
తమిళనాడు సీఎం పదవి రేసులో ఉన్న శశికళ ఆ కుర్చీ అందుకుంటారా లేదా అన్నది సంశయంలో పడింది. తనకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతూ గవర్నరును కలవడానికి వెళ్తున్న శశికళకు షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.   తన వెంట 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని శశికళ చెబుతుండగా.. తాజాగా 22 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పన్నీర్ నాయకత్వానికి మద్దతు పలకడంతో శశికళ లెక్కలపై అనుమానాలు మొదలయ్యాయి.
    
పన్నీర్ కు  తాజాగా 22 మంది సపోర్టు ఇవ్వడం ఒక్కటే కాకుండా  మరో 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో శశికళకు మింగుడుపడడం లేదు. వారు కూడా పన్నీర్ వద్దే ఉన్నారని ఆమె అనుమానిస్తున్నారట.  అంతేకాకుండా... పన్నీర్ కు 50 మంది ఎమ్మెల్యేల వరకు మద్దతు ఉందని తెలియడంతో శశికళ వర్గంలో ఉన్న కొందరు పునరాలోచనలో పడ్డారని.. పన్నీర్ తో టచ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.  తమ అంచనాలు తారుమారై, శశికళ సీఎం కాకపోతే, తమ రాజకీయ భవిష్యత్తు ఏంటనే ఆందోళన వారిలో మొదలైనట్టు సమాచారం.
    
శశికళ చెబుతున్నట్లు 130 మందిలో 40 మందిని తీసేస్తే ఆమెకు నికరంగా 90 మంది మద్దతు మాత్రమే ఉన్నట్లు. అలాంటప్పుడు ఆమె సీఎం కావడం కలే.  అయినా, శశి మాత్రం ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారందరినీ నిర్బంధించినట్లు చెబుతున్నారు. తమ వద్ద ఉన్న ఎమ్మెల్యేల ఫోన్లన్నింటినీ స్వాధీనం చేసుకున్న శశికళ వర్గం వాటిని ఆఫ్ లో ఉంచారట.
    
అయితే.. పన్నీర్ కు 40 నుంచి 50 మధ్య ఎమ్మెల్యేల మద్దతు ఉంటే ఆయన సీఎం అయ్యే అవకాశాలున్నాయి.  స్టాలిన్ తో పన్నీర్ టచ్ లో ఉన్నారని చెబుతున్న నేపథ్యంలో డీఎంకే మద్దతు దొరికితే ఆయన పంట పండినట్లే. పన్నీర్ అన్నాడీఎంకే నుంచి చీలిపోతే డీఎంకే ఆయనకు మద్దతు పలకొచ్చు. అప్పుడు డీఎంకేకు చెందిన 89 మంది సభ్యులు కూడా పన్నీర్ కు మద్దతు పలుకుతారు. దాంతో పన్నీర్ సీఎం కావడం ఖాయం. మొత్తానికైతే శశికళకు దారులు మూసుకుపోతున్నట్లుగా కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News