430 కేజీల బంగారం...505 కోట్ల బ్లాక్ మ‌నీ

Update: 2016-12-24 14:09 GMT
పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత క్రియాశీలంగా రంగంలోకి దిగిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌, ఐటీ అధికారుల దాడులు ఫ‌లిస్తున్నాయి.  ఇదే రీతిలో దేశ రాజధాని ఢిల్లీలో పెద్దఎత్తున నల్లధనం వెలుగుచూసింది. శ్రీ లాల్‌ మహల్‌ లిమిటెడ్‌ అనే కమొడిటీ ట్రేడింగ్‌ కంపెనీ యాజమాన్యం నివాసాలు, కార్యాలయాల్లో లక్నో డీఆర్‌ ఐ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌) అధికారులు జరిపిన దాడుల్లో సుమారు 430కేజీల బంగారం పట్టుబడింది. దీని విలువ సుమారు రూ.120కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం మేరకు ఢిల్లీ, నొయిడా ప్రాంతాల్లో  జరిపిన ఈ దాడుల్లో బంగారంతో పాటు రూ.2.48కోట్ల విలువైన పాత నోట్లను - రూ.12 లక్షల విలువైన కొత్త నోట్లను పట్టుకున్నట్లు వెల్లడించారు. అంతేకాక సుమారు 80కేజీల వెండి - మరో 15 కేజీల బంగారు ఆభరణాలు పట్టుబడినట్లు డీఆర్‌ ఐ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

పెద్ద నోట్ల రద్దు తర్వాత ఐటీ శాఖ జరిపిన దాడుల్లో పెద్ద మొత్తంలో నగదు గుర్తించినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. డిసెంబర్ 21 వరకు  505 కోట్ల బ్లాక్ మనీని సీజ్ చేసినట్లు చెప్పారు. అంతేకాదు ఇందులో 93 కోట్ల కొత్త కరెన్సీ కూడా ఉంది. అటు ఈ దాడుల్లో మొత్తం 3వేల 590 కోట్ల విలువైన ఆధారాలు లేని నగదును గుర్తించామని, దీనికి సంబంధించి 3వేల 589 నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఇక దేశ వ్యాప్తంగా జరిగిన దాడుల్లో పెద్ద ఎత్తున బంగారం, వెండి కూడా  సీజ్  చేసినట్లు ఐటీ శాఖ తెలిపింది. ఇదిలాఉండ‌గా...నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన తర్వాత బ్లాక్‌ మనీ వీరులు ఎంచుకున్న అక్రమ మార్గాలపై సీబీఐ, ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. బ్యాంకు అధికారుల సహాయంతో జరిగిన అక్రమ లావాదేవీల గుట్టురట్టు చేసే పనిలో పడ్డారు. తాజాగా కేరళలోని మలప్పురం జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుపై సీబీఐ రైడ్‌ చేసింది. నోట్ల రద్దు తర్వాత కొంతమంది ఈ బ్యాంకులో భారీ ఎత్తున డబ్బు డిపాజిట్‌ చేసినట్లు గుర్తించారు. మొత్తం 266 కోట్ల రూపాయల డిపాజిట్లను గుర్తించారు. వీటిలో చాలా మొత్తం లెక్క లేని ఆదాయంగా తేలింది. దీంతో ఈ మొత్తం డబ్బును సీజ్‌ చేశారు. అటు గుజరాత్ లోని అహ్మదాబాద్‌ లోని యాక్సిస్‌ బ్యాంకు లోబ్యాంకు అధికారులు 19 నకిలీ ఖాతాలు సృష్టించారు. వీటిలో 89 కోట్ల రూపాయలు డిపాజిట్లు చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నలుగురు బ్యాంక్ అధికారులను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News