5 ఎకరాలు.. 40 రకాల వరిపంట పండించేశాడు

Update: 2022-01-02 08:35 GMT
మనసులో బలమైన సంకల్పం.. రోటీన్ కు భిన్నంగా.. సవాళ్లకు ఎదురెళ్లటం.. ప్రయోగాలకు సిద్ధం కావటం.. సమస్యలు వచ్చి పడితే ఎదుర్కొందామన్న నిబ్బరం కలగలిపితే.. అనూహ్య విజయం సొంతమవుతుంది. ఇప్పుడు చెప్పే ఉదంతం ఈ కోవలోకే వస్తుంది. బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన ఒక కుర్రాడు రోటీన్ కు బిన్నంగా వ్యవసాయం చేయాలని భావించాడు. ఆ యువకుడి పేరు గడ్డం అశోక్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారం గ్రామానికి చెందిన ఇతనికి ప్రకృతి వ్యవసాయం.. సేంద్రీయ సాగు మీద మక్కువ ఎక్కువ.

ఈ రంగంలో నిపుణులైన డాక్టర్ సుభాష్ పాలేకర్.. విజయ్ రామ్.. నారాయణరెడ్డిలతో కలిసి కేరళలో కొంతకాలం పని చేశారు. వాళ్ల స్ఫూర్తితో 2012లో తనకున్న 3 ఎకరాలకు అదనంగా మరో 2 ఎకరాల్ని కౌలుకు తీసుకొని..అరుదైన వరి రకాల్ని సాగుకు శ్రీకారం చుట్టాడు. అప్పటి నుంచి ఏటా కొత్త రకాల్ని సాగు చేయటం మొదలు పెట్టాడు. ఆశించినంత మేర పంట చేతికి రావటం మొదలైంది. మంచి లాభాలు సొంతం చేసుకోవటంతో పాటు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయటం మొదలుపెట్టారు. ఇలా మొదలైన అతని ప్రయాణం స్థానిక రైతుల సహకారంతో 250 రకాల దేశీయ విత్తనాల్ని డెవలప్ చేసి ప్రశంసలు పొందాడు.

ప్రకృతి వ్యవసాయంలో భాగంగా రైతుల అనుభవాలు.. శాస్త్రవేత్తల సూచనలు.. అధికారుల సలహాల తీసుకున్న అశోక్.. 50 గోవుల్ని కూడా పెంచుతున్నాడు. జింజువా.. ఈరమణి రకాలకు చెందిన గడ్డిని మహారాష్ట్ర.. రాజస్థాన్ ల నుంచి ప్రత్యేకంగా తెప్పించి పెంచుతున్నారు. దీంతో అధిక పాల ఉత్పత్తికి సాయమవుతుంది. దేశీయంగా విత్తనాల్ని సొంతంగా తయారు చేయటం.. పంటలో వాడాల్సిన వేప పిండి.. సేంద్రియ ఎరువులను అశోక్ సొంతంగా తయారు చేయటంతో పాటు.. రోటీన్ కు భిన్నంగా చేస్తున్న వ్యవసాయం ఇప్పుడు అందరిని విపరీతంగా ఆకర్షిస్తోంది.
Tags:    

Similar News