పడవను తీయడం కష్టమే..మరో 5 మృతదేహాలు లభ్యం

Update: 2019-09-18 06:44 GMT
తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద గోదావరి నదిలో పడవ మునిగి మూడు రోజులు దాటింది. ఈ బోటు ఖచ్చితంగా ఎక్కడ మునిగింది.. ఎంత లోతులో ఉందనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. 315 అడుగుల లోతులో పడిపోయి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఖచ్చితంగా ఎక్కడ ఉందని మాత్రం లోకేట్ కాలేదు. పడవ మునిగి మూడు రోజులు కావడంతో ఇక ఎవరూ బతికి ఉండే చాన్స్ లేదని అధికారులు నిర్ధారణకు వచ్చారు. పడవతోపాటు వారు కూడా జలసమాధి అయినట్టేనని అధికారులు తేల్చేశారు.

బోటు చాలా లోతులో ఉండడం..5 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద ప్రవాహం.. పైగా మురికినీరుతో బోటును గుర్తించడం చాలా కష్టమవుతోంది. పైగా కింద ఇసక మేటలు వేయడం.. పడవ కొట్టుకొని పోవచ్చనే అంచనాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

బోటును, మృతదేహాలను వెలికితీయడం కోసం ఎన్టీఆర్ ఎఫ్ - ఎస్డీఆర్ ఎఫ్ - నౌకాదళం - ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ బృందాలు ఆపరేషన్ మొదలు పెట్టినా ఇప్పటివరకూ బోటును గుర్తించలేకపోయాయి. బోటును వెలికితీయడం అత్యంత కష్టమని నౌకదళ అదికారి నిపుణుడైన దశరథ్ స్పష్టం చేయడం గమనార్హం. దేశంలోని పూర్తి టెక్నాలజీని వాడినా జాడ దొరకలేదని చెప్పారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడం.. మురికినీరు వల్ల 60 అడుగల లోతుకు మించి స్కూబా డైవర్లు వెళ్లలేకపోతున్నారు. సోనార్ రైడర్లు కూడా పడవను గుర్తించలేకపోతున్నాయి.

*తాజాగా ఐదు మృతదేహాలు లభ్యం

బోటు మునిగిన ఘటనలో తాజాగా మరో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇప్పటివరకు 33 మృతదేహాలను బృందాలు వెలికితీశాయి. కాగా కచ్చలూరులో పడవ మునిగితే కాకినాడకు 70 కిలోమీటర్ల దూరంలోని యానాంలో ఒక చిన్నారి మృతదేహం లభ్యమైంది.  చిన్నారి మృతదేహం గుర్తుపట్టలేనంతగా ఉంది.దీన్ని బట్టి వరద ఉధృతికి మృతదేహాలు ఎంత దూరం కొట్టుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు.  మరో 13 డెడ్ బాడీలు దొరకాల్సి ఉంది. ఈ మేరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
Tags:    

Similar News