5వేల అక్రమ ఫ్లాట్లు.. లబ్ధిదారుల పాట్లు

Update: 2021-12-13 23:30 GMT
ఒకటీ కాదు రెండూ కాదు ఏకంగా 5 వేల ఫ్లాట్లు.. జీహెచ్ఎంసీ పరిధిలో వందలాది అపార్ట్ మెంట్లలో అక్రమంగా నిర్మిస్తున్న ఫ్లాట్లివి. బిల్డర్లు అమ్మి చేతులు దులుపుకొంటుండగా.. కొన్నవారు సంకట స్థితిలో పడే పరిస్థితి ఎదురవుతోంది. ఏళ్లుగా కలలుగన్న సొంతింటి ఆశలు నీరుగారిపోతాయేమోనని వారంతా ఆందోళన చెందుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు.. అక్రమ కట్టడాలను గుర్తించేందుకు తాజాగా రంగంలోకి దిగడంతో వారందరిలో గుబులరేగుతోంది. అప్పోసొప్పో చేసి, రుణం తీసుకునో ఫ్లాట్లు కొనుక్కున్నవారు తీరా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుండడం చూసి లబోదిబోమంటున్నారు.

విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్లులు, అపార్ట్మెంట్లకు ఏటా జీహెచ్ఎంసీలో 12 వేల నిర్మాణాలకు అనుమతులిస్తుంటారు. వీటిలో హెచ్ఎండీఏ పరిధిలోని 4 వేలుంటాయి. అయితే, నాలుగు అంతస్తులకు అనుమతి తీసుకుని 6, 7 నిర్మించడంతో అవన్నీ అనధికార నిర్మాణలుగా మిగిలిపోతున్నాయి. ఇక్కడా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం ప్లానింగ్ విభాగ అధికారులకు రూ.లక్షల్లో లంచాలు ఇస్తున్నారు. అనుమతి ఉన్న ఫ్లాటులో చదరపు అడుగు రూ.7 వేల వరకు ఉంటే.. అనుమతి లేని దాంట్లో రూ.4 వేల వరకు ఉంది. హెచ్ఎండీఏలో అయితే, రైతుల దగ్గర నుంచి చాలా తక్కువకు ఎకరాలకు ఎకరాలు కొని ఒక అపార్ట్ మెంటుకు అనుమతితో రెండు, మూడు కడుతున్న ఉదాహరణలున్నాయి.

ఇక ఆ పక్కనే ఉండే ప్రభుత్వ భూమో, చెరువో ఆక్రమణ సరేసరి. అక్రమంగా నిర్మించిన అపార్ట్ మెంట్లకు పంచాయతీ అనుమతి తీసుకుంటున్నారు. కొనుగోలుదారులకు మాత్రం జీహెచ్ఎంసీ అనుమతిని చూపుతున్నారు. ఇప్పడు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆదేశాలతో అధికారులు అక్రమ ఫ్లాట్ల గుర్తింపు చేపట్టారు. అయితే, ఇప్పటికే అపార్టుమెంటు పూర్తయి ఎవరైనా నివాసం ఉంటుంటే కూల్చివేత చేపట్టబోరు. నిర్మాణంలో ఉన్నవాటిని మాత్రం కూల్చివేస్తారు. కాగా, బిల్డర్లు స్థానిక ఎమ్మెల్యెనో లేదా కార్పొరేటర్ కో డబ్బు ఇచ్చి ఉన్నందున అక్రమ నిర్మాణం కూల్చివేత సాధ్యమేనా అన్న ప్రశ్న వస్తుంది.
Tags:    

Similar News