మెట్రో టికెట్లపై 50% డిస్కౌంట్.. ఎక్కడంటే?

Update: 2019-10-01 01:30 GMT
పేరుకు ప్రజారవాణా అనే కానీ.. టికెట్ల ధరలు భారీగా ఉన్నాయన్న విమర్శ హైదరాబాద్ మెట్రో మీద ఉంది. మెట్రో ఆరంభంలో టికెట్ల ధరలపై అభ్యంతరాలు వ్యక్తమైతే.. పూర్తిస్థాయిలో రూట్లు అందుబాటులోకి వచ్చినంతనే నెలసరి పాసులు.. టికెట్ల ధర తగ్గింపు గురించి ఆలోచిస్తామని చెప్పటం తెలిసిందే. ఒక రూటు మినహాయించి మిగిలిన అన్ని రూట్లు అందుబాటులోకి వచ్చినప్పటికి మెట్రో టికెట్ల ధరల్ని తగ్గించని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. హైదరాబాద్ కు పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై మెట్రో టికెట్లపై 50 శాతం రాయితీ ఇవ్వాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. చెన్నై మెట్రోలో రోజుకు సగటున 1.2 లక్షల మంది ప్రయాణిస్తుంటే.. వారాంతంలో మాత్రం ప్రయాణికులు సంఖ్య భారీగా పడిపోతోంది. దీంతో.. ప్రయాణికుల్ని ఆకట్టుకునేందుకు చెన్నై మెట్రో యాజమాన్యం వారాంతంలో 50 శాతం ధరల్ని తగ్గించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

త్వరలోనే ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఈ ఏడాది మొదట్లో చెన్నై మెట్రో రైలు నెలవారీ పాసుల్ని అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాస్ ద్వారా ప్రయాణికులు ఎన్నిసార్లు అయినా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించింది. ఇందులో భాగంగా నెలకు రూ.2500 మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. 2017లో మెట్రో యాజమాన్యం వారం పాటు టికెట్ల ధరలో 40 శాతం రాయితీ కల్పిస్తే.. ప్రయాణికుల సంఖ్య 67 శాతం మెరుగుపడింది.

దీంతో... వారాంతంలో 50 శాతం రాయితీ ఇవ్వాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. చెన్నై మెట్రో రైలు యాజమాన్యం ప్రయాణికుల్ని ఆకర్షించేందుకు ఇంతలా కిందామీదా పడుతుంటే.. హైదరాబాద్ మెట్రోకు అలాంటి ఇబ్బందులు లేవు.అంచనాకు మించిన ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. రద్దీ కూడా భారీగా పెరిగింది. అయినప్పటికీ.. టికెట్ల ధరల తగ్గింపు కానీ.. నెలవారీ పాసుల విషయంలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోవటం లేదు. ధరలు తగ్గిస్తే.. మరింతగా హైదరాబాద్ మెట్రో రద్దీ పెరిగే అవకాశం ఉందంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసే కేసీఆర్ సర్కారు.. మెట్రో టికెట్ల ధరల విషయంలో మాత్రం తమ వంతు బాధ్యతగా ఈ అంశాన్ని పరిశీలించటం లేదన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News