మోడీ ఎంత 'మొన‌గాడో' చెప్పిన‌ స్విస్ రిపోర్ట్‌!

Update: 2018-06-29 05:57 GMT
మేం కానీ అధికారంలోకి వ‌స్తేనా?  విదేశాల‌కు త‌ర‌లి వెళ్లిన న‌ల్ల‌ధ‌నాన్ని వెన‌క్కి తీసుకొస్తాం. అక్ర‌మార్కుల ఆస్తుల్ని ప్ర‌భుత్వ ఖ‌జానాలో చేర్చి.. దేశ ప్ర‌జ‌ల ఖాతాల్లోకి బ‌దిలీ చేస్తామంటూ భారీ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చి..  దేశ ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని దోచుకున్న వైనం తెలిసిందే. నాలుగేళ్ల మోడీ పాల‌న ఎంత బాగుందో తెలుసా? అంటూ వాట్సాప్ గ్రూపుల్లో మోడీ మీద ప్రేమ‌ను ట‌న్నుల లెక్క‌న కురిపించే వారితో పాటు.. అంద‌రూ తెలుసుకోవాల్సిన ప‌చ్చి నిజం ఒక‌టి నివేదిక రూపంలో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

న‌ల్ల‌ధ‌నంపై ఉక్కుపాదం మోపుతామ‌ని.. దేశం నుంచి త‌ర‌లి వెళ్లే ధ‌నానికి చెక్ పెడ‌తామ‌ని సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ చెప్పిన మోడీ మాట‌ల్ని అప‌హాస్యం చేసేలా.. ఆయ‌న పాల‌నలోని డొల్ల‌త‌నాన్ని బ‌య‌ట‌పెట్టే నివేదిక ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. మోడీ అధికారంలోకి వ‌చ్చిన మూడేళ్ల త‌ర్వాత 2017లో స్విస్ బ్యాంకుల్లో భార‌తీయుల డ‌బ్బు నిల్వ‌లు యాభై శాతం పెరిగిన ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

న‌ల్ల‌ధ‌నంపై మోడీ ప్ర‌భుత్వం కొర‌డా విదిల్చిన త‌ర్వాత మూడేళ్లు త‌గ్గుతూ వ‌చ్చిన న‌ల్ల‌ధ‌నం నిల్వ‌లు.. 2017లో మాత్రం 50 శాతానికి పెరిగి.. సుమారు రూ.7వేల కోట్ల‌కు చేరుకున్న వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది. 2016లో స్విస్ బ్యాంకుల్లో భార‌తీయుల సొమ్ము 45 శాతం త‌గ్గుద‌ల న‌మోదైతే.. అందుకు భిన్నంగా 2017లో మాత్రం అంత‌కు రెట్టింపు వృద్ధి చెంద‌టం గ‌మ‌నార్హం.

2006 నాటికి స్విస్ బ్యాంకుల్లో భార‌తీయులు దాచుకున్న డ‌బ్బు రికార్డు స్థాయిలో రూ.23వేల కోట్ల‌కు చేరుకుంటే.. త‌ర్వాతి కాలంలో ఆ డ‌బ్బు నిల్వ‌లు త‌గ్గుతూ వ‌చ్చాయి.  ఇదంతా ఒక ఎత్తు అయితే 2017లో మాత్రం డ‌బ్బు నిల్వ‌లు 50 శాతానికి పెరిగిన వైనాన్ని తాజాగా స్విట్జ‌ర్లాండ్ జాతీయ బ్యాంకు విడుద‌ల చేసిన నివేదిక‌లో వెల్ల‌డించింది. 2017లో అన్ని విభాగాల్లోనూ డ‌బ్బు వెల్లువెత్తిన‌ట్లుగా పేర్కొంది.  మ‌రి.. దీనికి మోడీ స‌ర్కారు ఏం బ‌దులిస్తుందో చూడాలి.
Tags:    

Similar News