అమరావతికి 500ఎకరాలు చాలంటున్న టీఆరెస్

Update: 2016-07-27 08:00 GMT
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి వేల ఎకరాలు భూమిని సమీకరించడంపై తెలంగాణ అధికార పార్టీ టీఆరెస్ పార్టీ నేత ఒకరు మండిపడ్డారు. ఇంతకాలం తమకు అనవసరమైన విషయంగా భావించి.. పొరుగు రాష్ట్రానికి సంబంధించిన అంశంగా భావించి ఇంతకాలం ఈ విషయంలో జోక్యం చేసుకోలేదని - కానీ - తమ రాష్ర్ట వ్యవహారాల్లో వేలుపెడుతున్న టీడీపీ ఇప్పుడు తమ ప్రశ్నకు సమాధానం చెప్పాలని ఆయన అంటున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన మ‌ల్ల‌న్నసాగ‌ర్ ప్రాజెక్టుపై టీడీపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో టీఆరెస్ ఎంపీ బూరనర్సయ్య గౌడ్ ఏపీలోని టీడీపీ ప్రభుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏపీ ప్ర‌భుత్వం చేప‌ట్టిన‌ ప‌నుల్లో ఇంతవరకు తాము ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని చెప్పిన ఆయన.. అమరావతిలో అడ్డగోలు భూసేకరణపై మేమెప్పుడైనా ఏమైనా అన్నామా.. మరి మా రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయం ఏపీ ప్రభుత్వానికి ఎందుకని ఆయన ప్రశ్నించారు.

ప‌క్క‌రాష్ట్రంతో స‌త్సంబంధాలు ఉండాల‌న్న ఉద్దేశంతోనే తాము అమరావతి విషయంలో జోక్యం చేసుకోలేదని చెప్పిన  నర్సయ్య..  రాజ‌ధాని పేరుతో చంద్రబాబు ప్రభుత్వం  రైతుల‌నుంచి ఎన్నోవేల ఎక‌రాల భూమి లాక్కుందని.. నిజానికి 500 ఎకరాలు చాలని అన్నారు. అన్ని వేల ఎకరాలను ఏ చ‌ట్ట ప్ర‌కారం తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. రాజధానికి అంత భూమి ఎందుకని ఆయన దుయ్యబట్టారు. రెండు రాష్ట్రాల‌కు మ‌ధ్య మంచి వాతావ‌ర‌ణం ఉండాల‌నే తాము కోరుకుంటున్నామని.. దాన్ని చెడగొట్టొద్దని సూచించారు. టీడీపీ - కాంగ్రెస్ నేత‌లు తెలంగాణ చేప‌డుతోన్న ప్రాజెక్టుల‌పై క‌నీస అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతున్నారని బూర న‌ర్స‌య్య అన్నారు.  ప్రాజెక్టుల‌కు ప్ర‌తిప‌క్ష నేత‌లు సైంధ‌వుల్లా అడ్డుప‌డుతున్నారని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు

తెలంగాణ‌లో అధికారంలోకి రావాల‌ని టీడీపీ - కాంగ్రెస్ నేత‌లు కుట్ర‌లు ప‌న్నుతున్నారని బూర‌ న‌ర్స‌య్య ఆరోపించారు. ఆ కుట్రలో రైతులు భాగ‌స్వామ్యం కావ‌ద్దని ఆయ‌న సూచించారు. కాంగ్రెస్‌ నేతలు పులిచింతల ప్రాజెక్టు కోసం 28 గ్రామాలను మంచిన విషయం అందరికీ తెలుసని..  కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయిందని ఆయన ఆరోపించారు. ఏపీ ప్ర‌భుత్వం తెలంగాణ ప్రాజెక్టుల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తోందని ఆరోపించారు. ఇలాగే వారి ధోర‌ణి కొన‌సాగితే టీడీపీ నేత‌ల‌ను ప్ర‌జ‌లు గ్రామ‌ల్లోకి రానివ్వరని అన్నారు.
Tags:    

Similar News