మోడీ.. ద మేజిక్ బాస్

Update: 2015-08-18 03:50 GMT
యాభై వేల మంది ప్రజలు.. ఒక చోటకు చేరటం. అది కూడా తమ పనులను వదులుకొని.. ఉద్యోగాలకు సెలవు పెట్టి.. వీకెండ్ కు వెళుతున్నట్లుగా.. పెళ్లాం.. పిల్లలతో కలిసి ఒక రాజకీయ నాయకుడి ప్రసంగం వినేందుకు వెళ్లటం సాధ్యమేనా? అది కూడా దుబాయ్ లాంటి దేశంలో..? మామూలుగా అయితే ఇలాంటివి వర్క్ వుట్ కావు. కానీ.. ప్రధాని నరేంద్ర మోడీ మేజిక్ వేరు. ఆయనంటే చాలు.. అభిమానం ఉప్పొంగుతుంది. దేశం.. విదేశం లాంటి వాటితో పని లేకుండా ఆయన  వస్తున్నారంటే చాలు.. నమో.. నమో అంటూ రాగాలు తీస్తారు. ఆయన్ను చూసేందుకు.. ఆయన మాట వినేందుకు జనం బారులు తీరుతారు.

అది అమెరికా కావొచ్చు.. ఆస్ట్రేలియా కావొచ్చు.. దుబాయ్ అయినా ఆయనకు ఒకటే. వేదిక మాత్రమే మారుతుంది. కానీ.. మోడీ మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాతా వేలాది మంది సభికులు మంత్రించినట్లుగా ఉండిపోతారు. వారి నోటి వెంట.. నమో.. నమో అన్న మాటలే వినిపిస్తాయి. కరతాళ ద్వనులు చేయటం.. ఏదో సాధించినట్లుగా సంబరపడిపోతూ ఇంటికి బయలుదేరతారు.

ఒక ముస్లిం దేశంలో.. ఒక విదేశీ నేత బహిరంగ సభ నిర్వహించటమే కద్దు. ఆ సభకు పోటెత్తినట్లుగా జనసందోహంతో కిక్కిరిసిపోవటం ఆశ్చర్యం కంటే అద్భుతం కూడా. దుబాయ్ లాంటి దేశంలో క్రికెట్ మ్యాచ్ లకో.. లేదంటే స్టార్ నైట్ ల కోసం రద్దీ ఉంటుంది. కానీ.. భారత్ కు చెందిన ఒక నేత వచ్చారని.. ఆయన మాటలు వినేందుకు బారులు తీరటం మాత్రం మోడీకే సాధ్యమవుతుందేమో. భారత్ మాతాకీ జై అన్న నినాదాలతో పాటు.. భారత్ మాతాకీ అని మోడీ అంటుంటే.. జై.. జై అంటూ జయజయద్వానాలతో స్టేడియం దద్దరిల్లిపోయేలా చేయటం మోడీకే సాధ్యమవుతుందేమో.

‘‘పిల్లల్ని మీతో తీసుకెళ్లొద్దు.. అంత సురక్షితం కాదు’’ అని దుబాయ్ లోని సభ నిర్వాహకులు ఇచ్చిన సూచనలు.. సలహాల్ని భారతీయులు అస్సలు పట్టించుకోలేదు. దుబాయ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు రద్దీ ఎక్కువగా ఉంటుందన్న నేపథ్యంలో పిల్లల్ని తీసుకెళ్లొద్దంటూ నిర్వాహకులు చేసిన సూచనను భారతీయులు పెద్దగా పట్టించుకోకుండా.. కుటుంబ సమేతంగా మోడీ మాటలు వినేందుకు తరలి వెళ్లటం చూసినప్పుడు.. మోడీ ఒక మేజిక్ మాస్టర్ లా కనిపించటం ఖాయం.

దుబాయ్ లో మోడీ ప్రసంగించేందుకు వీలుగా ఒక స్టేడియంను సిద్ధం చేశారు. ఈ స్టేడియంలో వేడిగా ఉండకుండా ఉండేందుకు సభకు 24 గంటల ముందు నుంచే బ్లోయర్లతో చల్లబర్చటానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇక.. దుబాయ్ క్రికెట్ స్టేడియం సామర్థ్యం 40 వేలు. ఊహించినదాని కంటే భారీగా భారతీయులు తరలిరావటంతో.. స్టేడియం బయట మరో 15 వేల మంది కార్యక్రమాన్ని చూసేలా ఏర్పాట్లు చేశారు. మోడీ సభ సందర్భంగా స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది.

స్టేడియం లోపల అన్ని దిక్కులా అరబ్బీలో స్వాగతం నమో అన్న బ్యానర్లు దర్శనమిచ్చాయి. భారతీయ కంపెనీల్లో దాదాపు అన్నీ.. మోడీ సభను దృష్టిలో ఉంచుకొని సోమవారం హాఫ్ డే సెలవు ప్రకటించాయి. సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో మోడీ ప్రసంగం ఉంటుందని తెలిసినా.. స్టేడియంకు మాత్రం మధ్యాహ్నం ఒంటి గంటకే జనం పోటెత్తారు. చివరకు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో స్టేడియంలోకి జనాల్ని అనుమతించారు. రద్దీ ఎక్కువగా ఉండటం కారణంగా స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. మోడీ సభను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు స్థానిక మీడియా ప్రయత్నించినా.. యూఏఈ ప్రభుత్వం మాత్రం అందుకు అనుమతించలేదు.  ఏది ఏమైనా మోడీ తన మేజిక్ ను మరోసారి దుబాయ్ సాక్షిగా ప్రదర్శించారు.
Tags:    

Similar News