వణికించే వాస్తవం.. 24 గంటల్లో 6.57లక్షల కేసులు

Update: 2020-11-15 04:15 GMT
మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఫస్ట్ వేవ్ లో చుక్కలు చూపించిన కరోనా.. సెకండ్ వేవ్ లో కొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే కోట్లాది మందిని సోకిన కరోనా.. తొలిసారి తన పాత రికార్డుల్ని చెరిపేస్తూ.. భారీ ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఒక రోజులో అత్యధిక కేసులు నమోదు కావటం ఇదే తొలిసారి. శనివారం ప్రపంచ వ్యాప్తంగా 6.57 లక్షల కొత్త కరోనా కేసులు నమోదైనట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క కట్టింది. కరోనా మొదలైన తర్వాత ఇంత భారీగా కేసులు.. అది ఒక్కరోజులో నమోదు కావటం ఇదే తొలిసారిగా ప్రకటించింది.

కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోన్నప్పటికీ.. ప్రజల్లో మార్పు రాకపోగా.. గతంలో మాదిరి కరోనాకు వణికిపోవటం లేదు. జాగ్రత్తలు తీసుకోవటం లేదు. ఇది కూడా ఎక్కువ కేసులు నమోదు కావటానికి కారణంగా భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మన దగ్గర మాత్రమే కాదు.. ప్రపంచ దేశాల్లోనూ ఇలాంటి పరిస్థితే.

తొలిసారి కరోనా మీద ఉన్న భయం.. ఆందోళన.. సరైన మందు లేదన్న మాటలు.. ఇలా ఎన్నో అంశాలు భయపెట్టేవి. అందుకు భిన్నంగా ప్రజలు వ్యవహరిస్తున్నారు. నెలల తరబడి ఇళ్లకే పరిమితం కావటం.. కనుచూపు మేర వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేకపోవటంతో భయంతో కొందరు.. అందుకు భిన్నంగా మరికొందరు రోడ్ల మీదకు వచ్చేయటంతో కొత్త కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

గడిచిన 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో అమెరికా.. యూరప్ దేశాలు ముందున్నాయి. యూరప్ దేశాల్లో రోజులో 2.85లక్షల కేసులు నమోదయ్యాయి. అంతేకాదు..కరోనా మరణాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న మరణాలు 9797 కావటం గమనార్హం. మొత్తంగా చూస్తే.. కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న వేళ.. మనం కూడా మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే. లాక్ డౌన్ తర్వాత అలవాటైన కొన్నింటిని ఎంత త్వరగా మానేస్తే అంత మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News