ఏడాదికి 70 కోట్ల డోసులు కొవాగ్జిన్‌ : భారత్‌ బయోటెక్ !

Update: 2021-04-21 07:30 GMT
హైదరాబాద్  దిగ్గజ ఫార్మా సంస్థ భారత్‌ బయోటెక్‌ తన కొవాగ్జిన్‌ టీకా ఉత్పత్తిని రెండున్నర రెట్లు పెంచనున్నది. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ అవసరాలు, అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌ కు అనుగుణంగా ఏడాదికి 70 కోట్ల కొవాగ్జిన్‌ డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆ కంపెనీ స్పష్టం చేసింది. దీనికోసం హైదరాబాద్‌, బెంగళూరులోని తమ ప్లాంట్లను దశలవారీగా విస్తరిస్తున్నట్లు తెలిపింది. దీనిద్వారా ఇనాక్టివేటెడ్‌ వైరస్‌ టీకాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే టాప్‌ అంతర్జాతీయ కంపెనీల సరసన భారత్‌ బయోటెక్‌ చేరబోతోంది.

ఏడాదికి  20 కోట్ల డోసులు లక్ష్యంగా ఇప్పటికే కొవాగ్జిన్‌ టీకాల ఉత్పత్తిని ప్రారంభించిన భారత్‌ బయోటెక్‌, గత కొంత కాలం నుంచి తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని క్రమంగా పెంచుతుంది. మార్చి నెలలో 1.5 కోట్ల డోసులను తయారు చేసింది. వచ్చే నెలలో 3 కోట్ల కొవాగ్జిన్‌ డోసులను ఉత్పత్తి చేయనున్నట్లు భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు. కొవాగ్జిన్‌ తయారీకి అవసరమయ్యే ముడి పదార్థాలు, ప్యాకేజింగ్‌ సామగ్రి, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ లాంటి పదార్థాలకు ఎలాంటి కొరత లేదని కంపెనీ స్పష్టం చేసింది. ఇతర దేశాల్లో ఇనాక్టివేటెడ్‌ వైరస్‌ టీకాలను తయారు చేస్తున్న తమ భాగస్వామ్య సంస్థలతో కూడా ఉత్పత్తిని పెంచేలా ఒప్పందాలు చేసుకుంటామని,ఇప్పటికే కొవాగ్జిన్ ‌కు కావాల్సిన ముడిపదార్థాల తయారీకి ఇండియన్‌ ఇమ్యునోలాజికల్స్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నది. ఈ సంస్థ ఇనాక్టివేటెడ్‌ వైరస్‌ టీకాను ఉత్పత్తి చేయగలదని, ఈ నేపథ్యంలో కొవాగ్జిన్‌ సాంకేతికత బదలాయింపుపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక్కో కొవాగ్జిన్‌ డోస్‌కు 15 నుంచి 20 డాలర్ల (రూ.1,100 నుంచి రూ.1,500) వరకు వసూలు చేస్తున్నట్టు భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది.సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కూడా కొవిషీల్డ్‌ టీకా ఉత్పత్తిని నెలకు 10 కోట్ల డోసులకు పెంచనున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎస్‌ఐఐలో దాదాపు 7 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తున్నారు. తమకు నిధుల కొరత ఉన్నదని, ఆర్థిక సహాయం అందిస్తే ప్లాంట్‌ను విస్తరించి మరింత జోరుగా కొవిషీల్డ్‌ టీకా ఉత్పత్తి చేస్తామని కంపెనీ సీఈవో అధర్‌ పూనావాలా ఇటీవలే పేర్కొన్నారు‌.
Tags:    

Similar News