70 మంది ఒక్క‌సారే ఆత్మ‌హ‌త్య చేసుకుంటార‌ట‌

Update: 2015-08-09 06:57 GMT
దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన వ్యాపం కేసు ఇంకా త‌న సంచ‌ల‌నాల‌ను కొన‌సాగిస్తోంది. వ్యాపం స్కామ్‌ తో ఇప్పటికే కేంద్ర ప్ర‌భుత్వం స‌హా బీజేపీ పీకల్లోతు  కష్టాల్లో ఉంది. రోజూ ఈ అంశంపై కాంగ్రెస్‌ పార్లమెంట్‌ ను కుదిపేస్తోంది. తాజాగా ఈ కేసులో నిందితులు ప్రస్తుతం గ్వాలియర్‌ సెంట్రల్‌ జైల్లో ఉన్న  70 మంది వైద్య విద్యార్ధులు,  జూనియర్‌ డాక్టర్లు కొత్త సంచ‌లానికి వేదిక‌గా నిలిచారు.

ఈ నేప‌థ్యంలో రాష్ర్ట‌ప‌తికి వారు లేఖ రాశారు. వ్యాపం ఉద్యోగులు, ఉన్నతాధికారుల అక్రమాల వల్ల బలిపశువులయ్యామంటూ మెడికోలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నెలల తరబడి జైల్లో ఉన్నామని, కేసు విచారణ ఆలస్యంగా జరగడం వల్ల తమ భవిష్యత్‌ అంధకారమైందంటూ లేఖలో తెలిపారు. దీని వల్ల  అటు సమాజంలోనూ... ఇటు మానసికంగా తీవ్ర వేదన అనుభవిస్తున్నామన్నారు. తమ కుటుంబాలు సైతం ఆర్థికంగా చితికిపోయాయని తెలిపారు.

న్యాయవ్యవస్థ అసమానత్వం  వల్ల తమకు బెయిల్‌ రావడం ఆలస్యమవుతోందన్న మెడికోలు.. ఈ  కేసులో ప్రధాన నిందితుడికి  సెషన్స్‌, హైకోర్టుల్లో బెయిల్‌ లభించిందంటూ గుర్తు చేశారు. తమకు మాత్రం బెయిల్‌ ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్‌ ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యమని, దీనికి అనుమతి ఇవ్వాలంటూ మెడికోలు రాష్ట్రపతిని కోరారు.

వ్యాపం నిందితులు తమకు చావే శరణ్యమంటూ ఏకంగా రాష్ట్రపతికే లేఖ రాయ‌టం కలకలం రేపుతోంది. దీనిపై ప్రణబ్‌ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News