ఐబీ అలెర్ట్‌!... ఉగ్ర‌వాదులు చొర‌బ‌డ్డార‌ట‌!

Update: 2017-08-31 10:59 GMT
మరోసారి పఠాన్‌ కోట తరహా దాడులు జరిపేందుకు ప్రయత్నించవచ్చని ఇంటెలిజెన్స్‌ బ్యూరో బాంబు పేల్చింది. 8 మంది జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు ఈ నెల 23న జమ్ము-కశ్మీర్‌ లోని ఫూంచ్‌ వద్ద వాస్తవాధీన రేఖదాటి మన దేశంలోకి ప్రవేశించారని వెల్లడించింది. వీరంతా ప్రస్తుతం పంజాబ్‌ లో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. గతవారం పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 8మంది భద్రతా సిబ్బందిని పొట్టనబెట్టుకున్న 11మంది ఉగ్రవాదుల బృందంలోని 8మంది వీరేనని ఇంటెలిజెన్స్‌ బ్యూరో స్పష్టంచేసింది.

ఈ దాడి అనంతరం వారు పంజాబ్ చేరుకుని ఉండొచ్చని భావిస్తోంది. మరోసారి పఠాన్‌ కోట్‌ తరహా దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని అనుమానిస్తోంది. ఈ మేరకు పంజాబ్‌ పోలీసులను అప్రమత్తం చేసింది. దీంతో ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఉగ్రవాదులు గురుదాస్‌ పూర్‌ దిశగా వెళ్లి ఉండవచ్చని ఇంటెలిజెన్స్‌ బ్యూరో ప్రత్యేకంగా పేర్కొంది. జైషే మహమ్మద్ తదితర సంస్థలకు చెందిన ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడేందుకు పాకిస్థాన్‌ సహకరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.

తాజాగా దేశంలో చొరబడిన జైషే ఉగ్రవాదులు పఠాన్‌ కోట్‌ - పార్లమెంట్‌ పై దాడి తరహాలో కీలక ప్రాంతాల్లో దాడులు జరిపే ప్రమాదముందని హెచ్చరించింది. ఈ నెల 23న దేశంలోకి ఉగ్రవాదులు ప్రవేశించారని ప్రకటించిన ఐబీ ఒకరోజు వ్యవధిలోనే రెండో హెచ్చరిక జారీ చేసింది. వాస్తవాధీన రేఖ దాటి దేశంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు రెండు బృందాలుగా విడిపోయి కశ్మీరు లోయలోకి చొరబడ్డారనేది దాని సారాంశం. దీనిలో ఒక బృందం పంజాబ్‌‌ లో పెద్దఎత్తున దాడులకు పాల్పడవచ్చని ఇంటెలిజెన్స్‌ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కీలక ప్రాంతాల్లో నిఘా కట్టుదిట్టం చేశాయి.
Tags:    

Similar News