విప్రోలో విషాదం: బ్రిట‌న్ లో మ‌నోళ్లు 8 మంది మృతి

Update: 2017-08-28 04:22 GMT
టెక్ దిగ్గ‌జాల్లో ఒక‌టైన విప్రో తీవ్ర విషాదంలో మునిగింది.ఈ కంపెనీకి చెందిన ఉద్యోగులు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం ఘోర ప్ర‌మాదానికి గురైంది. బ్రిట‌న్ లో చోటు చేసుకున్న ఈ ఘోర రోడ్డు ప్ర‌మాదంలో 8 మంది భార‌తీయులు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. గ‌డిచిన 24 సంవ‌త్స‌రాల్లో ఆ దేశంలో జ‌రిగిన అతి ఘోర‌మైన రోడ్డు ప్ర‌మాదం ఇదేన‌ని చెబుతున్నారు.

శ‌నివారం జ‌రిగిన ఈ ప్ర‌మాదం విష‌యానికి వ‌స్తే.. బ‌కింగ్ హోమ్ షైర్ లోని న్యూపోర్ట్ పాగ్నెల్ లో జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో విప్రోకు చెందిన ఐటీ ఉద్యోగులు.. వారి కుటుంబ స‌భ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్ర‌మాదం విప్రోలో తీవ్ర విషాదాన్ని నింపింది.

విప్రోకు చెందిన ఐటీ ఉద్యోగులు వారి కుటుంబ స‌భ్యులు క‌లిసి టూర్ లో భాగంగా ఒక మినీ బ‌స్ లో వెళుతున్నారు. వీరు ప్ర‌యాణిస్తున్న మినీ బ‌స్ అదుపు త‌ప్పి రెండు లారీల‌ను ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు విప్రో ఉద్యోగులు ఘ‌ట‌న‌స్థ‌లంలో మ‌ర‌ణించారు. మిగిలిన వారు వైద్య సేవ‌లు పొందుతూ మ‌ర‌ణించారు. మినీబ‌స్సులో మొత్తం 12 మంది ప్ర‌యాణిస్తున్నారు. తీవ్రంగా గాయ‌ప‌డిన వారిలో ప్రాణాలుతో ఉన్న న‌లుగురిలో ఒక‌రిద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

బాధితులంతా కేర‌ళ‌.. త‌మిళ‌నాడుకు చెందిన వారేన‌ని చెబుతున్నారు. విప్రో ఉద్యోగి కార్తికేయ‌న్ రామ‌సుబ్ర‌మ‌ణియం.. అత‌ని భార్య‌.. ఇత‌ర ఉద్యోగులు రిషి రాజీవ్ కుమార్‌.. వివేక్ భాస్క‌ర్ లు ఉన్నారు. విప్రోకు చెందిన మ‌నోరంజ‌న్ ప‌న్నీర్ సెల్వ‌మ్‌.. ఆయ‌న స‌తీమ‌ణి సంగీత తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అయితే.. వారి మామ‌య్య‌.. త‌ల్లిదండ్రులు మ‌ర‌ణించారు.

ఈ ఘోర రోడ్డు ప్ర‌మాదం తీవ్ర‌మైన విషాదంగా విప్రో లిమిటెడ్ యూకే- యూరోప్ ఆప‌రేష‌న్స్ హెడ్ ర‌మేష్ ఫిలిప్స్ తెలిపారు. బాధితుల‌కు త‌గిన సాయాన్ని అందిస్తున్నామ‌న్నారు. మ‌రో విషాదం ఏమిటంటే.. ప్ర‌మాదానికి గురైన మినీ ట్ర‌క్ ను న‌డుపుతున్న డ్రైవ‌ర్ సిరియాక్ జోసెఫ్ కూడా కేర‌ళ‌కు చెందిన వారే. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన ఇద్ద‌రు లారీ డ్రైవ‌ర్ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక‌రిపై డ్రంకెన్ డ్రైవ్ కేసును నమోదు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. 1993 త‌ర్వాత బ్రిటన్ లో చోటు చేసుకున్న అత్యంత ఘోర‌మైన రోడ్డు ప్ర‌మాదం ఇదేన‌ని చెబుతున్నారు. 1993లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో 12 మంది చిన్నారులు.. వారి టీచ‌ర్ మ‌ర‌ణించారు.
Tags:    

Similar News