కేసీఆర్ కేబినెట్‌.. తొలుత 8 మందే.. లెక్కేంటంటే

Update: 2019-01-27 07:32 GMT
తెలంగాణ‌ రాష్ట్రంలో ఇప్పుడు అత్యంత ఉత్కంఠ‌ను రేకెత్తించే అంశం ఏదైనా ఉందంటే...అది మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణే!.ముఖ్యమంత్రిగా కేసీఆర్, హోంమంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేయగా మిగతా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అన్నది గులాబీ నేతలను కలవరపెడుతుంది. తనకు పదవి దక్కుతుందా లేదా? అంటూ సహచర నేతలతో నిత్యం చర్చలు జరుపుతున్నారు. సంక్రాంతికి ముందే విస్తరణ అని కొన్నాళ్ళు.. యాగం తర్వాత అని మరికొన్నాళ్లు ప్రచారం చక్కర్లు కొట్టగా ఇప్పుడు మాఘమాసంలో విస్తరణకు మంచి ముహూర్తం పెట్టేసినట్లుగా తెలుస్తుంది. తాజాగా ఎట్‌ హోం సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ ఈఎల్ ఎల్ న‌ర‌సింహ‌న్‌ తో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సుదీర్ఘ స‌మావేశంలో ఈ స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ట్లు చెప్తున్నారు.

ఈనెల 30న మూడోవిడత పంచాయతీ ఎన్నికలు ముగియనుండగా, ఆ తర్వాత విస్తరణ తేదీని సీఎం ఖరారుచేసే అవకాశముందన్న ప్రచారం తాజాగా వినబడుతోంది. ఒక‌వేళ‌, ఆ రోజు కాక‌పోతే, ఫిబ్రవరి 5,7, 10 తేదీలలో ఏదో ఒక రోజున తొలివిడత విస్తరణ చేస్తారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో బలంగా ఉంది. కాగా, మంత్రివర్గంలోకి ఆరు నుండి ఎనిమిది మందిని తీసుకుంటారన్న అంచ‌నాల నేప‌థ్యంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. లోక్ సభ ఎన్నికల తర్వాత మరోసారి పూర్తి స్థాయిలో విస్తరించే అవకాశాలున్నాయని అంటున్నారు. గతంలో పనిచేసిన మంత్రులందరికీ మళ్లి క్యాబినెట్‌ బెర్తులు దక్కే అవకాశం లేదు. పాత-కొత్తల మిశ్రమంగా క్యాబినెట్‌ కూర్పు ఉంటుందని సీఎం స్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో మొత్తం క్యాబినెట్‌ లో ఆరు నుండి ఎనిమిది మంది కొత్తవారు ఉండే అవకాశం ఉందని, తొలివిడత క్యాబినెట్‌ విస్తరణలోనూ ఇద్దరు లేదా ముగ్గురు కొత్తవారు ఉండవచ్చన్న అంచనాలు ప్రచారంలో ఉన్నాయి.

2015లో సీఎం చండీయాగం నిర్వహించిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టారని, ఇపుడు అదే సెంటిమెంట్‌ కూడా రిపీట్‌ అవుతుందని అంటున్నారు. ఇక కేంద్రప్రభుత్వం కూడా తొలుత ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెడుతుందని భావించగా, ఇపుడు పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా విస్తరణ నేపథ్యంలో పరిగణనలోకి తీసుకోబోతున్నారు. ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు తొలివిడత క్యాబినెట్‌ లో చోటుదక్కే అవకాశాలు లేవన్న ప్రచారం టీఆర్‌ ఎస్‌ వర్గాల్లో ఉంది. మిగ‌తా జిల్లాల వారికి అవకాశం క‌ల్పించ‌నున్నారు. ఎప్పటికీ సీనియర్లకే అవకాశం ఇస్తే రెండు, మూడు సార్లు గెలిచిన వారికి అవకాశాలు ఎలా వస్తాయన్న ఆలోచనలో సిఎం కేసీఆర్ ఉన్నారని సన్నిహితులంటున్నారు. దీంతో గత కేబినెట్లోని చాలా మందికి ఈ సారి నో ఛాన్స్ అంటున్నారు. అలాంటి సీనియర్లందరినీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయించి.... తర్వాతే పూర్తి స్థాయిలో మంత్రి వర్గ విస్తరణ చేపడతారనే ప్రచారం వినిపిస్తోంది. స్థూలంగా, పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితం త‌ర్వాత ఈ మేర‌కు స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని పేర్కొంటున్నారు.
Tags:    

Similar News