భోపాల్ లో 8 మంది ఉద్ర‌వాదులు హ‌తం

Update: 2016-10-31 08:46 GMT
ఎనిమిది మంది సిమీ ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు మ‌ట్టుబెట్టాయి. అయితే, ఇదేమీ పాక్ స‌రిహ‌ద్దులోనో లేక చొర‌బాట్ల‌లోనో కాదు! ఈ ఉగ్ర‌వాదులు గ‌తంలోనే భ‌ద్ర‌తా ద‌ళాల‌కు ప‌ట్టుబ‌డ్డాయి. దీంతో వీరిపై వివిధ కేసుల విచార‌ణ సాగుతోంది.  దీంతో వీరిని మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లోని భోపాల్ సెంట్ర‌ల్ జైల్లో ఉంచారు. అయితే, వీరు జైలు నుంచి పారిపోయేందుకు పెద్ద ప‌న్నాగం ప‌న్నారు. ఈ క్ర‌మంలో జైలులోని హెడ్ కానిస్టేబుల్‌ ను రమా శంకర్ ను త‌మ ద‌గ్గ‌రున్న గ్లాసు - కంచంతో కిరాతకంగా చంపారు. అనంతరం - వారివ‌ద్ద ఉన్న బెడ్ షీట్ల‌నే తాడు మాదిరిగా పేని దాని సాయంతో జైలు గోడ దూకి ప‌రార‌య్యార‌ని తెలుస్తోంది.

ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న స్థానిక పోలీసులు స‌హా భ‌ద్ర‌తా బ‌ల‌గాలు పెద్ద ఎత్తున రంగంలోకి దిగి జ‌ల్లెడ ప‌ట్టాయి. జైలుకు క‌నీసం ప‌ది కిలో మీట‌ర్ల దూరంలోని ఎన్ ఖేడీ అనే గ్రామంలో వీరంతా న‌క్కి ఉన్నార‌న్న ప‌క్కా స‌మాచారంతో వారిపై దాడిచేశారు. అయితే వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా, వారు ప్రతిఘటించడంతో పోలీసులు కాల్పులు జరపార‌ని స‌మాచారం. దీంతో ఈ ఎనిమిది మందీ హ‌త‌మ‌య్యారు. వీరు జైలు నుంచి త‌ప్పించుకున్న గంట‌లోనే ఎన్‌ కౌంట‌ర్‌ లో హ‌త‌మ‌య్యారు.

 ఇక‌, జైలు నుంచి ఉగ్ర‌వాదులు త‌ప్పించుకున్నార‌న్న వార్త‌ల‌తో హుటాహుటిన సీఎం శివ‌రాజ్‌ సింగ్ చౌహాన్ వెంట‌నే స్పందించారు. అందుబాటులో ఉన్న అత్యున్న‌త‌స్థాయి అధికారులు స‌హా మంత్రుల‌తో స‌మీక్ష‌ నిర్వ‌హించారు. జైలులో గ‌స్తీ బాధ్య‌త‌ల‌ను నిర్ల‌క్ష్యంగా వ‌హించిన న‌లుగురు అధికారుల‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేసిన‌ట్టు తెలిసింది. ఇదిలావుంటే, రాష్ట్రంలో అతిపెద్ద సెంట్ర‌ల్ జైలులో భ‌ద్ర‌త నాలుగు నుంచి ఆరు అంచెల్లో ఉంటుంది. భారీ ఎత్తున ప్ర‌హ‌రీ గోడ‌లు కూడా రెండు అంచెల‌లో ఉంటాయి. ప్ర‌తి గోడ పైభాగాన క‌రెంటు ఫెన్సింగ్ ఉంటుంది. ముట్టుకోవ‌డ‌మే కాదు దాని ఛాయ‌ల‌కు వెళ్తేనే షాక్ కొట్టే ప‌రిస్థితి ఉంటుంది.

అదేవిధంగా ఉగ్ర‌వాదుల‌ను ఉంచిన బ్యార‌క్‌ల‌కు ఇద్ద‌రు నుంచి ముగ్గురు హెడ్ కానిస్టేబుల్ స్థాయి అధికారులు కాప‌లాగా ఉంటారు. చీమ చిటుక్కు మ‌న్నా తెలిసేలా భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ ఉంది. అయిన‌ప్ప‌టికీ.. ఒక‌రు కాదు 8 మంది ఈ జైలు నుంచి ఎలా త‌ప్పించుకున్నారు? ప‌ది కిలో మీట‌ర్ల దూరానికి ఎలా చేరుకున్నారు? ఎవ‌రైనా అధికారులు వీరికి స‌హ‌క‌రించారా? అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి వీట‌న్నింటికీ స‌మాధానం చెబుతారో లేక కామ‌న్ అని వ‌దిలేస్తారో చూడాలి.  మొత్తానికి ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నం రేపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News