పవర్లోకి వచ్చాక జగన్ సర్కారు కేసులు ఎత్తేసిన ఆ ‘8’ మంది వైసీపీ నేతలు వీరే

Update: 2021-08-12 03:39 GMT
తాజాగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు.. తాజాగా ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో హైకోర్టు అనుమతి లేకుండా ఎత్తేసిన కేసుల విషయం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఏపీలోని అధికారపక్ష నేతలకు సంబంధించిన పలుకేసుల్ని జగన్ ప్రభుత్వం ఎత్తేయటం తెలిసిందే. ఒక్క సీఎం జగన్ మీద 15 కేసుల్ని ఉపసంహరించుకోగా.. ఆయన పార్టీకి చెందిన ఎనిమిది మంది నేతలపై ఉన్న 30 కేసుల్ని ఈ మధ్య కాలంలో ఉపసంహరించుకున్నారు. మరి.. ఆ కేసుల్ని సుప్రీం తాజా వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి పున: సమీక్షించాల్సిన పరిస్థితి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దీంతో.. ఎనిమిది మంది వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్థితి. ఇంతకీ ఆ ఎనిమిది మంది నేతలు ఎవరు? వారిపై ఉపసంహరించుకున్న కేసులు ఏమిటన్నది చర్చగా మారింది. ఈ ఎనిమిది మందిలో అత్యధిక కేసులు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మీదనే ఎత్తేశారు. ఆయనపై పది కేసుల్ని ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాతి స్థానం లోక్ సభలో వైసీపీ లోక్ సభ పక్ష నేత కమ్ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద మూడు కేసుల్ని ఉపసంహరించుకున్నారు.

రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీద రెండు కేసులు.. మంత్రి పేర్ని నాని.. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి.. ఎంపీ కమ్ జగన్ బంధువు వైఎస్ అవినాష్ రెడ్డి.. పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్.. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డిలపై ఒక్కొక్క కేసును ఉపసంహరించుకున్నారు. ఇక్కడ ప్రస్తావించిన కేసులన్ని కూడా ఆయా నేతలు తమ ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నవే కావటం గమనార్హం. నేతల వారీగా వారిపై ఎత్తేసిన కేసుల ఏమిటన్నది చూస్తే..

మిథున్ రెడ్డి

- 2009లో ఎంవీ క్రిష్ణారెడ్డి.. మరో నలుగురితో వెళుతున్న వాహనాన్ని అడ్డగించి..రక్తం వచ్చేలా గాయపరిచారు
- తనకు చెందిన 15 మందికి బోర్డింగ్ పాసులు ఇవ్వాలని కోరితే ఇవ్వనందుకు రేణిగుంట ఎయిర్ పోర్టులో ఎయిరిండియా మేనేజర్ రాజశేఖర్ పై దౌర్జన్యానికి పాల్పడిన ఉదంతం

- 2015లో ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండానే పీహెచ్ సీని ప్రారంభించి.. అక్రమ చొరబాటుకు పాల్పడ్డారన్న అభియోగం

జక్కంపూడి రాజా

- పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి నిరసనగా నిర్వహించిన భారత్ బంద్ లో రాజమహేంద్రవరంలోని స్పెన్సర్ షాపు మేనేజర్ ను దుర్భాషలాడి కొట్టారు. అతన్ని రక్షించేందుకు వెళ్లిన తనను తిట్టి.. అంతు చూస్తానని బెదిరించినట్లుగా సుబ్రమణ్యేశ్వరరావు అనే ఇన్ స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు.

- పోలీసు అధికారుల్ని బెదిరించేలా ప్రసంగించారన్న ఆరోపణలపై రాజమహేంద్రవరం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి

- 2019లో ఎన్నికల పోలింగ్ రోజున అహోబిలం ప్రభుత్వం పాఠశాల మద్ద బ్రిజేంద్రనాథ్ వర్గం.. భార్గవ్ రామ్ వర్గం చట్టవిరుద్ధంగా పరస్పరం కర్రలు.. రాళ్లు విసురుకొని దాడి చేసుకున్నారన్న ఆరోపణ

వైఎస్ అవినాష్ రెడ్డి

- 2015లో బెదిరింపు.. ఉద్యోగుల అడ్డగింత అభియోగంపై కేసు నమోదు

జోగి రమేశ్

- 2017లో నందిగామ వద్ద జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాదంలో మరణించిన వారి డెడ్ బాడీలను వారి కటుంబ సభ్యులకు అప్పగిస్తున్న వేళ..చట్టవిరుద్దంగా గుమిగూడారన్న ఆరోపణతో కేసు నమోదు

పేర్ని నాని

- 2015లో బందరు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డటం.. ప్రభుత్వ ఉద్యోగినిని విధులు నిర్వర్తించకుండా బలప్రయోగం చేశారన్న ఆరోపణపై కేసు నమోదు.

కాకాణి గోవర్ధన్ రెడ్డి

- మాజీ మంత్రి సోమిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు. తన ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు ఫోర్జరీ పత్రాల్ని క్రియేట్ చేసి మోసం చేశారన్న ఆరోపణపై కేసు నమోదు.
Tags:    

Similar News