ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల కేసులు..88,500 మంది మృతి

Update: 2020-04-09 06:30 GMT
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది. ప్రపంచంలోని 208 దేశాలకు కరోనా పాకింది.  ఇప్పటికే చాలా దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లాయి. దాదాపు 350 కోట్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కోట్లాది మంది జీవనోపాధి పోయి రోడ్డున పడ్డారు. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి.

గురువారం నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 15 లక్షలు దాటింది. ఇప్పటివరకు కరోనా వైరస్ వల్ల 88వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికా - ఇటలీ - స్పెయిన్ - ఫ్రాన్స్ దేశాల్లోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి.

గడిచిన 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 5వేల మంది మరణించారు. అమెరికాలో బుధవారం ఏకంగా 1800 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 30వేల కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా బాధితుల సంఖ్య 4.35 లక్షలకు చేరింది. అమెరికాలో మొత్తం మరణాల సంఖ్య 17795కి చేరుకుంది.

ఇటలీలో మరణాల సంఖ్య 17669కు చేరింది. కొత్త కేసులు తగ్గాయి. స్పెయిన్ లో 1.48 లక్షల కేసులు నమోదు కాగా.. 14792మంది చనిపోయారు.

చైనాలో బుధవారం ఇద్దరు కరోనాతో చనిపోయారు. 63 కొత్త కేసులు నమోదయ్యాయి. వూహాన్ లో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేశారు. ఇరాన్ లో 3993కు మరణాల సంఖ్య చేసింది. బ్రిటన్ లో 7097మంది ప్రాణాలు కోల్పోగా.. బాధితుల సంఖ్య 60773కు చేరింది.

*దేశంలో 6వేలకు చేరిన కేసులు

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5734కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 5095 యాక్టివ్ కేసులుండగా.. 473మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే దేశంలో ఇప్పటి వరకు 166మంది కరోనాతో చనిపోయారు. 71మంది విదేశీయులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా మహారాష్ట్రలో 1135 కేసులు నమోదయ్యాయి.

*ఏపీలో 9మంది కరోనా బాధితుల డిశ్చార్జ్

ఢిల్లీ తబ్లిగీ ప్రార్థనలతో ఏపీలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. వారం పది రోజులుగా రాష్ట్రంలో కోవిడ్ తీవ్రరూపం దాలుస్తోంది. తాజాగా ఏపీలో 9మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.ఏపీలో కరోనా సోకిన వారి సంఖ్య 348కి చేరగా.. బుధవారం ఒక్కరోజే 34మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కర్నూలులో అత్యధికంగా 75 కేసులు నమోదయ్యాయి.

*తెలంగాణలో 490కి కరోనా కేసులు
తెలంగాణ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏకంగా 490మందికి చేరింది. ఇందులో 45మంది ఇప్పటికే వ్యాధి తగ్గి డిశ్చార్జ్అయ్యారు. 11 మంది ఇప్పటివరకు తెలంగాణలో మృతి చెందారు.



Tags:    

Similar News