హమాలీ పోస్టుల కోసం ఎంఫిల్‌, పీజీ విద్యార్థులు పోటీ

Update: 2016-06-22 11:57 GMT
దేశంలో ఉద్యోగాలకు కొదవ లేదని అటు కేంద్రం - ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఊదరగొడుతున్నా నిరుద్యోగ నిర్మూలనలో మాత్రం అడుగు ముందుకు పడటం లేదు. రాను రాను చదివిన చదువుకు - చేసే ఉద్యోగానికి పోలిక లేకుండా పోతున్నది. బీజేపీ పాలిత రాష్ట్రమైన మహారాష్ట్రలో ఐదు హమాలి (బస్తాలు మోయుట) పోస్టుల కోసం ఏకంగా ఐదుగురు ఎంఫిల్‌ - 262 మంది పీజీ - 984 మంది డిగ్రీ చదివిన విద్యార్థులు పోటీ పడి మరీ దరఖాస్తు చేసుకున్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వం హమాలి పోస్టులకు కనీస విద్యార్హత నాల్గవ తరగతిగా పేర్కొన్నది. దీని కోసం 2,424 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఐదుగురు ఎంఫిల్‌ - 262 మంది పీజీ విద్యార్హత కల్గిన వారుండగా, 984 మంది డిగ్రీ - 109 మంది డిప్లొమా పూర్తి చేసి ఉన్నారు. ఇంటర్‌ చదివిన విద్యార్థులు 605మంది ఉన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రరూపం దాల్చుతున్నదో దీన్ని బట్టే అర్థమవుతున్నదని అంటున్నారు.

ఇదిలాఉండ‌గా తమ పిల్లల చదువు కోసం, వారికి మెరుగైన భవిష్యత్తును అందించడం కోసం  భారతదేశంలోని మెజారిటీ తల్లిదండ్రులు రుణ ఉచ్చులోకి దిగడానికి కూడా వెరవడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. యూనివర్శిటీల్లో లేదా కాలేజీల్లో చదువు కోసం 71శాతం మంది తల్లిదండ్రులు విద్యా రుణాలను ఆశ్రయిస్తున్నారని హెచ్‌ ఎస్‌ బిసి నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. తమ పిల్లలను యూనివర్శిటీ విద్య కోసం విదేశాలకు పంపాలనుకునే తల్లిదండ్రులు 76శాతం ఉన్నారు. అవసరమైతే పిల్లల కాలేజీ - యూనివర్శిటీల చదువుల కోసం అప్పైనా చేయాలనే ఉద్దేశ్యంలో తల్లులు కన్నా తండ్రులే ఎక్కువగా వున్నారు. అటువంటి తల్లులు 64శాతం వుండగా తండ్రులు మాత్రం 78శాతం వున్నారు.

తమ రిటైర్‌ మెంట్‌ సేవింగ్స్‌ లో దాచిపెట్టుకోవడం కన్నా పిల్లల చదువు కోసం డబ్బు సమకూర్చడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు, ఇటువంటి తల్లిదండ్రులు దేశంలో 41శాతం మంది వున్నారు. ఇలా ఆలోచించేవారిలో తల్లులు 45శాతం ఉండగా, తండ్రులు మాత్రం 37శాతమే ఉన్నారు. ఇతరత్రా కార్యకలాపాలకు డబ్బు కేటాయించితే పిల్లల చదువుకు డబ్బు సమకూర్చుకోవడం చాలా కష్టమైపోతుందని 65శాతం మంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. పిల్లల కాలేజీ/యూనివర్శిటీ చదువులపై సగటున ఏటా రు.2.05లక్షలు ఖర్చు పెడుతున్నారు. రోజువారీ ఆదాయం నుండే కొంత మొత్తం తీసి పొదుపు చేసేవారు 70శాతం వున్నారు. 97శాతం మంది తల్లిదండ్రులే తమ పిల్లల చదువుకు నిధులు సమకూరుస్తుండగా, కేవలం 13శాతం మంది మాత్రమే యూనివర్శిటీ అందించే సాయంతో తమ పిల్లలు చదువుకోవాలని భావిస్తున్నారు.
Tags:    

Similar News