కరోనా యాంటీబాడీలతో పుట్టిన శిశువు .. ఎక్కడంటే !

Update: 2021-03-18 15:30 GMT
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. ఈ మహమ్మారి కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆరోగ్యం నుంచి జీవనశైలి వరకు అన్నింటిలో మార్పులకు కారణంగా నిలిచింది. కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైన ప్రారంభంలో ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే కరోనా వైరస్‌ని అంతమొందించేందుకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ప్రపంచంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతమవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాలో చోటు చేసుకున్న ఓ సంఘటన వైద్యులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

దక్షిణ ఫ్లోరిడాకు చెందిన మహిళ కరోనా యాంటీబాడీలు కలిగిన బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఈ మద్యే కరోనా టీకా తొలి డోస్ తీసుకుంది. మెటర్నల్ వ్యాక్సినేషన్ తర్వాత  ఆమెకు కరోనా యాంటీబాడీలతో శిశువు జన్మించింది. యాంటీబాడీలతో శిశువు జన్మించడం ఇదే మొదటిసారని పాల్ గిల్బర్ట్, చాడ్ రుడ్నిక్ అనే ఇద్దరు శిశు వైద్యులు తెలిపారు. బిడ్డకు జన్మనిచ్చిన మహిళ ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్ గా పనిచేసింది. జనవరిలో తాను 36 వారాల ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మోడెర్నా వ్యాక్సిన్ తొలి టీకాను తీసుకుంది.

మూడు వారాల తర్వాత మహిళ ఆరోగ్యంగా, బలంగా ఉన్న ఆడశిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన శిశువు బొడ్డు తాడు నుంచి రక్తాన్ని పరీక్షించిన రీసెర్చర్లు.. యాంటీబాడీలు ఉన్నాయని నిర్దారణ కి వచ్చారు.  మెటర్నల్ వ్యాక్సినేషన్ తీసుకోవడం ద్వారా Sars-CoV-2 వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి ముందుగానే శిశువుకు రక్షణ అందిందని రీసెర్చర్లు పేర్కొన్నారు. కరోనా వ్యాక్సినేషన్ తర్వాత యాంటీబాడీలతో శిశువు జన్మించడం  ప్రపంచంలోనే ఇదే మొదటిసారని పాల్ గిల్‌ బర్ట్ తెలిపారు. కరోనా టీకా తీసుకున్న తల్లి నుంచి శిశువుకు యాంటీబాడీలు అందాయా లేదా అని బొడ్డుతాడును పరీక్షించినట్టు చెప్పారు. ఈ యాంటీబాడీల వల్ల శిశువులకు రక్షణ లభిస్తుందా, రక్షణ లభించాలంటే ఎంత మోతాదులో యాంటీబాడీలు ఉండాలి అనేది తేలాలంటే మరిన్ని అధ్యయనాలు అవసరమని చెప్పారు. ఈమేరకు వివరాలతో పరిశోధనా పత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు.
Tags:    

Similar News