మోదీ బంగారం ప్రతిమ.. విశేషాలెంటీ?

Update: 2023-01-21 10:28 GMT
భారత ప్రధాన మంత్రి మోదీకి రాజకీయాలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా గుజరాత్ లో ఆయనకు ఉన్న క్రేజ్ మరో లెవల్ అని చెప్పొచ్చు. గుజరాత్ కు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన మోదీ ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మోదీ ఆధ్వర్యంలో బీజేపీ రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ప్రధానిగా ఇప్పటికే మోదీ ఎనిమిదేళ్లు పాలన పూర్తి చేసుకున్నారు.

మోదీ ప్రధాని అయ్యాక బీజేపీ వరుసబెట్టి అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తున్న సంగతి తెల్సిందే. దక్షిణాదిలో బీజేపీ క్రమంగా బలం పెంచుకుంటూ పోతుంది. కాగా ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లోనూ బీజేపీ తిరిగి తన అధికారాన్ని నిలుపుకుంది. భారీ మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఓ వ్యాపారి మోదీపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు.

ఏకంగా ప్రధాని మోదీ స్వర్ణ విగ్రహాన్ని తయారు చేసి ఔరా అనిపించుకుంటున్నాడు. ఈ విగ్రహానికి సంబంధించి విశేషాల్లోకి వెళితే.. గుజరాత్ లోని సూరత్ కు చెందిన గోల్డ్ వ్యాపారి బసంత్ బోహ్రకు మోదీ అంటే విపరీతమైన అభిమానం. ఈక్రమంలోనే బీజేపీ ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఈ విజయానికి గుర్తుగా ప్రధాని మోదీ బంగారు విగ్రహాన్ని తన ఫ్యాక్టరీలో తయారు చేయించాడు. దీనిని బాంబే గోల్డ్ ఎగ్జిబిషన్‌లో పెట్టాడు. ప్రధాని మోదీ బంగారు ముఖచిత్రంగా తీర్చిదిద్దిన తీరు అందరినీ ఆకర్షిస్తోంది. అంతేకాదూ ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి.

ఈ బంగారు ప్రతిమను 156 గ్రాముల బరువు ఉండేలా తీర్చిదిద్దారు. అసలైన 18 క్యారెట్ల బంగారంతో బోహ్రా పర్యవేక్షణలో సుమారు 15 నుంచి 20 మంది కళాకారులు కొన్నిరోజులు శ్రమించి దీనిని తయారు చేశారు. ఈ విగ్రహానికి అయిన ఖర్చు 11 లక్షలకు పైగా ఖర్చు అయినట్టు సమాచారం.

గతేడాది డిసెంబర్‌లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 156 స్థానాలు దక్కాయి. ఈ సంఖ్యకు అనుగుణంగా మోదీ బంగారు విగ్రహాన్ని రూపొందించారు. మోదీపై అభిమానంతోనే ఈ విగ్రహం తయారు చేశానని దీనికి ఇంకా విలువ కట్టలేదని బోహ్రా తెలిపారు. 20 ఏళ్లుగా నగల వ్యాపారంలో ఉన్న బోహ్రా ఇంతకు ముందు స్టాట్యూ ఆఫ్ యూనిటీ బంగారు నమూనాను కూడా తయారు చేయడం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News