ఒక పక్క బై ఎలక్షన్స్ కు రెడీ అవుతుంటే.. అక్కడ నుంచి కాల్ వచ్చింది!

Update: 2022-07-30 09:38 GMT
తెలంగాణలో రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం రోజుకో మలుపుతిరుగుతోంది. ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నాడని.. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశాడని పుకార్లు షికార్లు చేశాయి.  తాజాగా తన లక్ష్యాలను వివరిస్తూ కోమటిరెడ్డి ఒక లేఖ విడుదల చేశారు. ఆ లేఖను బట్టి ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. కేసీఆర్ లక్ష్యంగా రాజగోపాల్ ప్రకటనలు గుప్పించారు.

రాజగోపాల్ పైనా సొంత కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తాజాగా ఒత్తిడి పెరిగింది. పార్టీ వీడవద్దంటూ పార్టీలోని ఆప్తులు, అన్నయ్య వెంకటరెడ్డి సహా కొందరితో కాంగ్రెస్ అధిష్టానం రాయబారం నడుపుతోంది. ఇప్పటికే ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకొని రాజగోపాల్ రెడ్డితో భేటి అయ్యారు.

పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఫోన్ లో మాట్లాడారు. ఢిల్లీకి రావాలని కోరారు. రాహుల్ గాంధీతో భేటి కావాలని సూచించారు. కానీ రాజగోపాల్ మాత్రం ఢిల్లీకి వచ్చేందుకు ససేమిరా అంటున్నారు. రేపటి నుంచి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో పర్యటిస్తున్నారు.

ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో పార్టీ మారేందుకు క్షేత్రస్థాయి నేతలు,అనుచరులతో చర్చించారు. రాజీనామా అంశంలో కీలక నిర్ణయం తీసుకోలేక మీమాంసలో ఉన్నారు. బీజేపీలో చేరాలంటే ముందుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఉప ఎన్నికకు సిద్దం కావాలని.. తిరిగి గెలిపించుకుంటామని బీజేపీ ముఖ్య నేతలు హామీ ఇచ్చినట్టు తెలిసింది.

దీంతో రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. ఆయన అనుచరులు కూడా ఈ విషయంలో వద్దని వారిస్తున్నట్టు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికలను కేసీఆర్ కుటుంబం వర్సెస్ తెలంగాణ ప్రజల మధ్య యుద్ధంగా రాజగోపాల్ అభివర్ణించడం విశేషం.

ఇలా రాజగోపాల్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రెడీ అవుతుంటే.. మరో పక్క రాహుల్ గాంధీ నుంచే రాజగోపాల్ కు కాల్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి రాహుల్ కాల్ తోనైనా రాజగోపాల్ మారుతారా? లేక బీజేపీలో చేరిపోతారా? అన్నది వేచిచూడాలి.
Tags:    

Similar News