ట్వీట్ చేశారు సాయం నిమిషాల్లో అందింది

Update: 2016-04-01 16:06 GMT
వినియోగదారుడే మా రాజు. అతడికి సేవ చేసేందుకు సేవకుడిగా పని చేస్తామంటూ చాలానే వాణిజ్య సంస్థలు చెబుతుంటాయి. కానీ.. ఆ మాటను అక్షర సత్యంగా చేతల్లో చేసి చూపిస్తున్న సంస్థ ఏదైనా ఉందంటే.. అది భారతీయ రైల్వేగా చెప్పాలి. భారతీయ రైల్వేలో ప్రయాణించే ప్రయాణికుడు ఎవరైనా సరే.. తన ప్రయాణంలో అనుకోని ప్రమాదం సంభవించినా.. అవసరం ఏర్పడినా.. కేవలం ఒక్క ట్వీట్ తో ఆ శాఖను డీల్ చేస్తున్న కేంద్రమంత్రి రియాక్ట్ కావటమే కాదు.. నిమిషాల వ్యవధిలోనే దానికి పరిష్కారం లభించటమో.. లేదంటే సాయం అందటం ఈ మధ్యన చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా.. అలాంటి సాయమే అందించి మరోసారి వార్తల్లోకి వచ్చారు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు.

ఢిల్లీ నుంచి వైష్ణోదేవి అలయానికి వెళ్లేందుకు బిభూతి అనే ప్రయాణికుడు తన కుటుంబంతో కలిసి ట్రైన్లో ప్రయాణిస్తున్నాడు. అయితే ఇతని ఆరేళ్ల కుమారుడు అప్పర్ బెర్త్ నుంచి కిందపడటం.. తలకు గాయం కావటం.. రక్తం కారుతున్న నేపథ్యంలో.. సురేశ్ ప్రభు ట్విట్టర్ ఖాతాకు తన పరిస్థితి వివరిస్తూ.. సాయాన్ని అర్థించారు. కనీసం తనకు కాటన్ అన్నా అందించాలని వేడుకున్నాడు.

అయితే.. అతని ట్వీట్ చేసిన 20 నిమిషాల వ్యవధిలోనే మంత్రిత్వ శాఖ స్పందించటమే కాదు.. అతని ఫోన్ నెంబర్ చెప్పాలని కోరారు. తన ఫోన్ నెంబరు అందించి.. ట్రైన్ లూథియానా రైల్వే స్టేషన్ చేరుకునే సరికి వైద్య సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని సదరు ప్రయాణికుడు తన ట్విట్టర్ ఖాతాతో మరోసారి పేర్కొంటూ.. రైల్వేశాఖను విపరీతంగా పొగిడేశారు. గతంలోనూ ఇలాంటివెన్నో సాయాల్ని రైల్వే శాఖ చేసింది. సురేశ్ ప్రభు రైల్వే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఈ మార్పు చోటు చేసుకుందని చెప్పొచ్చు.
Tags:    

Similar News