ఆ అమ్మాయి ఇంటిపేరు అలా ఉందని.. జాబ్ కు రిజెక్టు

Update: 2020-07-24 03:00 GMT
చిన్న పొరపాట్లు ఒక్కోసారి పెద్ద సమస్యలుగా మారుతుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఉదంతం ఈ కోవలోకే వస్తుంది. అసోంకు చెందిన ఒక యువతి ఉద్యోగానికి అప్లై చేస్తే.. ఆమె ఇంటి పేరులో ‘బూతు’ ధ్వనిస్తుందని చెప్పి అప్లికేషన్ రిజెక్టు చేసిన వైనం షాకింగ్ గా మారింది. చివరకు తమ ఇంటి పేరును తప్పుగా పలకటం ద్వారా..తమ జాతిని అవమానిస్తున్నారంటూ ఆరోపణ చేశాక కానీ అధికారులు వెనక్కి తగ్గని పరిస్థితి. ఈ విచిత్రమైన ఉదంతంలోకి వెళితే..

అసోంలోని గోగాముఖ్ నగరానికి చెందిన ప్రియాంక సుటియా (Priyanka Chutia) అగ్రికల్చరల్ ఎకానమిక్స్.. ఆగ్రో మేనేజ్ మెంట్ లో మాస్టర్స్ ను పూర్తి చేసింది. తాజాగా ఆమె ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ సీడ్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఒక ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే.. ఆమె ఇంటి పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆమె అప్లికేషన్ ను రిజెక్టు చేయటంతో షాక్ తిన్నది.

Chutia అన్న పదాన్ని తప్పుగా ఉచ్చరించటంతో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది. ఆమె తన ఇంటి పేరును సుటియాగా చెబుతుంటే.. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం అందుకు భిన్నంగా ఉచ్చరించటంతో ఆమె ఆప్లికేషన్ రిజెక్టు అయ్యింది. దీంతో.. ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆ యువతి.. ఇంగ్లిషు పదాన్ని హిందీలో ఉచ్ఛరించటంలో జరిగే పొరపాటుకు తనను ఇబ్బంది పెడుతున్న వైనంపై సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

ఆమె తన ఇంటిపేరును ఆన్ లైన్ ఆఫ్లికేషన్ లో నమోదు చేయగానే.. అదే పనిగా సరైన పదాన్ని ఉపయోగించాలని పదే పదే అలెర్టు మెసేజ్ రావటంతో పాటు.. అప్లికేషన్ ను ఓకే చేయకపోవటంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇలా చేయటం ఎంతో పురాతనమైన తమ జాతిని కించపర్చటమేనని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టుకు స్పందించిన ప్రభుత్వ అధికారులు.. సాఫ్ట్ వేర్ లో మార్పులు చేయటంతో ఆమె సమస్య తీరింది. చూసేందుకు చిన్నదిగా అనిపించొచ్చు కానీ.. భావోద్వేగాల పరంగా చూస్తే.. కీలకంగా అనిపించక మానదు.
Tags:    

Similar News