ఈ రోజే కేసీఆర్ తీపి కబురు ఎందుకు చెబుతున్నారు?

Update: 2020-06-02 03:30 GMT
ఒక సినిమా విడుదలకు ముందు ఫస్ట్ లుక్.. టీజర్.. ఇలా ఊరించటం.. సదరు మూవీకి భారీ బజ్ తీసుకురావటం మామూలే. ఇప్పుడా అలవాటు రాజకీయాలకు చేరింది. తాము చేపట్టే కార్యక్రమాలకు సంబంధించిన వివరాల్ని పూర్తిగా చెప్పకుండా.. అంచనాల్ని పెంచేలా ఒక మాట చెప్పి ఊరుకోవటం.. దానిపై భారీ చర్చ జరిగేలా చేయటం ఇప్పుడో ఎత్తుగడగా మారింది. దీంతో.. ప్రభుత్వం చేపట్టే కొత్త కార్యక్రమం ఏమై ఉంటుందన్న అంశంపై ఎవరికి వారు మాట్లాడుకునేలా చేస్తున్నారు.

మొన్నీ మధ్యనే కొండపోచమ్మసాగర్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తానో తీపికబురు చెప్పనున్నట్లు ప్రకటించారు. ఇంతకీ అదేమిటన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికే పలు పథకాలు ప్రకటించిన రైతులకు..తాజాగా కేసీఆర్ చెప్పే తీపికబురు ఏమై ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి సారు తీపికబురు సోమవారం రాత్రికి రివీల్ అవుతుందని అంచనా వేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ముందు రోజు చెబితే.. బాగుంటుందని భావించారు.

కానీ.. అలాంటిదేమీ జరగలేదు. ఇప్పుడున్న అంచనా ప్రకారం ఈ రోజు (మంగళవారం) ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే రైతులకు సంబంధించి పలు పథకాల్ని అమలు చేస్తున్న వేళ.. ఇప్పుడు చెప్పే తీపికబురు ఏమై ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పంటలు పండించేందుకు వాడే ఎరువులు.. పురుగుమందుల్ని ఉచితంగా అందించే అవకాశమే ఎక్కువ అంటున్నారు. ఏడో వసంతంలోకి అడుగుపెట్టే ఈ రోజున అన్నదాత మోము మురిసేలా సీఎం కేసీఆర్ ప్రకటన ఉంటుందని అంచనా వేస్తున్నారు. తన మాటతో భారీగా హైప్ పెరిగిన నేపథ్యంలో.. దాన్ని అందుకునేలా ముఖ్యమంత్రి తీపి కబురు ఉంటుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News