వికారం కలిగేలా ఎంత దారుణంగా భార్యను హత్య చేశాడంటే?

Update: 2020-01-16 11:55 GMT
భార్యను భర్త.. భర్తను భార్య చంపే పాడు రోజులు వచ్చేశాయి. ఎవరు ఎప్పుడు ఎందుకు చంపుతారో అర్థం కాని దుస్థితి. మనిషి అంతకంతకూ ఉన్మాదిగా మారిపోతున్న వైనం చూస్తే.. మానవత్వం ఎందుకంతలా మాయమవుతోందన్న సందేహం కలుగక మానదు. ఇప్పుడు మీరు చదివే వార్త రాయకుండా ఉండాల్సింది. కానీ.. మనిషిలోని ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే నచ్చకున్నా.. రాయాల్సి వస్తోంది.

ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఒక హత్య వివరాలు తెలిస్తే వణుకే కాదు.. వికారం కలగటం ఖాయం. ఇంతా చేస్తే.. అంత దారుణంగా ఎందుకు హత్య చేశాడన్నది చూస్తే.. అడ్డు తొలగించుకోవటం.. చేసిన ఛండాలమైన పని బయటకు రాకూడదని. అంత భయం ఉన్నోళ్లు అసలు హత్య చేయాలన్న ఆలోచనే రాకూడదు. కానీ.. చిన్న విషయాలకు ఏళ్లు ఏళ్లుగా కలిసి ఉన్న వారిని చంపేయటం మాత్రం పైశాచికమేనని చెప్పక తప్పదు.

రాయ్ బరేలీకి చెందిన 35 ఏళ్ల రవీంద్రకు 27 ఏళ్ల ఉర్మిళతో పెళ్లైంది. వారికి ఇద్దరు కుమార్తెలు. ఒకరికి పదకొండేళ్లు.. మరొకరికి ఏడేళ్లు. మూడో సంతానంగా అబ్బాయి పుట్టాలన్నది రవీంద్ర కోరిక. అనుకున్నట్లే భార్య గర్భవతి అయ్యింది. అయితే.. ఈసారి భార్య అమ్మాయిని కంటే? ఈ ఆలోచన వచ్చిన తర్వాత అతడిలోని పశు మనస్తత్వం బయటకు వచ్చింది. భార్యను అడ్డు తొలగించుకోవాలనుకున్న అతడను తండ్రి.. సోదరుల సాయంతో భార్యను దారుణంగా చంపేశాడు.

భార్య ఉర్మిళ గొంతు నులిమేసిన రవీంద్ర అనంతరం పదునైన ఆయుధంతో ఆమె శరీరాన్ని ముక్కలు చేశాడు. వాటంన్నింటిని పిండి చేసే మరలో గ్రైండ్ చేశాడు. మిగిలిన శరీర భాగాల్ని కాల్చి వేసి.. ఆ బూడిదను.. పాక్షికంగా కాలిన శరీర భాగాల్ని ఒక సంచిలో మూటగట్టుకొని ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొదల్లో పడేశాడు. తర్వాత తనకేమీ తెలీనట్లుగా ఇంటికి చేరుకున్నాడు.

ఉర్మిళ కనిపించకపోవటంతో ఆమె తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఆరా తీయగా సరైన సమాధానం రాకపోవటంతో.. పోలీసులను ఆశ్రయించారు. ఊర్మిళ కోసం వెతికిన పోలీసులు.. విచారణలో భాగంగా రవీంద్రను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. అదే సమయంలో తల్లిని తండ్రే చంపారంటూ పిల్లలు ఇద్దరు చెప్పటంతో అసలు విషయం బయటకు వచ్చింది. భార్యను ఎలా చంపావన్న ప్రశ్నకు అతగాడు ఇచ్చిన సమాధానం విన్న అధికారులు అవాక్కు అయ్యారు. భార్యకు హత్య చేసేందుకు రవీంద్రకు సాయం చేసిన తండ్రి.. సోదరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


Tags:    

Similar News