టీడీపీకి కీల‌క నేత రాజీనామా.. పార్టీ కార్యాల‌యానికి తాళం!

Update: 2022-07-19 04:39 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌కాశం జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. పార్టీ కీలక నేత‌, దర్శి టీడీపీ ఇన్‌చార్జి పమిడి రమేష్‌ అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేశారు. పార్టీ కోసం తాను ఎంత కష్టపడినా పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు గుర్తించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశార‌ని అంటున్నారు.

దీనికి నిర‌స‌న‌గా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని మూసివేసి తాళాలు వేసేశారు. పార్టీ కార్యాల‌యానికి తాళం వేసిన వీడియో వైరల్‌ అవుతోంది.

2020 నవంబరు నుంచి దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జిగా పమిడి రమేష్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తిరిగి పార్టీ పటిష్టతకు కృషి చేశారు.

పార్టీ కార్యక్రమాలకు సొంత డబ్బును ఖర్చు చేస్తూ వచ్చారు. ఇంత చేస్తున్నా పార్టీ అధిష్టానం తనను గుర్తించడం లేదని సన్నిహితుల వద్ద పలు మార్లు వాపోయినట్టు సమాచారం. మరో రెండేళ్లలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ద‌ర్శిలో తీవ్ర దెబ్బ త‌గ‌ల‌డంతో కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న చెందుతున్నార‌ని స‌మాచారం.

కాగా దర్శి నుంచి 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావుతోపాటు, 2012లో దర్శి టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు సైతం వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు.

దీంతో దర్శిలో టీడీపీకి నాయకత్వం వహించే దిక్కే లేకుండా పోయింది. 2020 నవంబరులో పమిడి రమేష్‌ టీడీపీ ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఆయ‌నే ఇన్చార్జిగా ఉన్నారు. ఇప్పుడు ఆయ‌న కూడా త‌ప్పుకోవ‌డంతో టీడీపీకి నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని అంటున్నారు.
Tags:    

Similar News