వయసు48.. 14 పెళ్లిళ్లు.. బాధితుల్లో లాయర్లు.. డాక్టర్లు

Update: 2022-02-16 04:44 GMT
అతడి వయసు 48. ఇప్పటివరకు పద్నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఒకరి గురించి మరొకరిని వివాహమాడిన ఈ ఒడిశా మధ్యవయస్కుడి లీలలు గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. తనను తాను వైద్యుడిగా చెప్పుకునే ఇతగాడు ఇప్పటివరకు ఏడు రాష్ట్రాలకు చెందిన మహిళల్ని మోసం చేశాడు. తాజాగా అతగాడిని పోలీసులు పట్టుకోవటంతో అతడి భాగోతం బయటకు వచ్చింది. ఇతగాడి భార్యల జాబితాలో డాక్టర్లు..లాయర్లు.. టీచర్లు మాత్రమే కాదు పారా మిలటరీ దళంలో పని చేస్తున్న మహిళ కూడా ఉండటం గమనార్హం.

ఒడిశాకు చెందిన బిధు ప్రకాశ్ కు తొలిసారి 1982లో తొలిసారి పెళ్లి చేసుకున్నాడు. రెండోసారి 2002లో పెళ్లి చేసుకున్నాడు. ఈ రెండు పెళ్లిళ్లకు సంబంధించి అతనికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. అనంతరం మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా పలువురు మహిళల్ని పరిచయం చేసుకునే అతను.. తనను తాను డాక్టర్ గా చెప్పుకునేవాడు. తాజాగా ఢిల్లీకి చెందిన ఒక టీచర్ ను పెళ్లాడి భువనేశ్వర్ లో ఉంటున్నాడు. అతను అంతకు ముందు పలు పెళ్లిళ్లు చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న ఆమె.. పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అతడి లీలలు బయటకు వచ్చాయి.

అతడ్ని విచారించిన క్రమంలో పోలీసులకు షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. అతనుఇప్పటివరకు ఢిల్లీ.. పంజాబ్.. అసోం.. జార్ఖండ్.. ఒడిశాతో సహా ఏడు రాష్ట్రాలకు చెందిన మహిళల్ని మోసం చేసినట్లు తేలింది. అతడి బాధితుల జాబితాలో డాక్టర్లు.. లాయర్లు.. టీచర్లు.. పారా మిలటరీ దళంలో పని చేస్తున్న మహిళలుకూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడి నుంచి 11 ఏటీఎం కార్డులు.. నాలుగు ఆధార్ కార్డులతో పాటు ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇతను హైదరాబాద్.. ఎర్నాకులంలో నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసే అలవాటు కూడా ఉందని గుర్తించారు.

Tags:    

Similar News