ఎవరినీ నమ్మలేమా? ..కొడుకుతో భార్య.. కుమార్తెను చంపించిన భర్త

Update: 2019-08-30 05:50 GMT
విన్నంతనే వణుకు పుట్టటమే కాదు.. ఇలా అయితే ఎవరిని నమ్మాలి? ఎవరిని విశ్వాసంలోకి తీసుకోవాలి? అన్న ప్రశ్నలే కాదు.. రానున్న రోజులు మరెంత అనాగరికంగా ఉంటాయన్న భయాందోళనలు వ్యక్తమయ్యే పరిస్థితి. భార్యను భర్త.. భర్తను భార్య.. తండ్రిని కొడుకు.. కొడుకును తండ్రి.. అన్నను తమ్ముడు.. అక్కను చెల్లెలు.. ఇలా ఒక కుటుంబంలోని వారిని వారి.. వారి వ్యక్తిగత స్వార్థాల కోసం చంపేస్తున్న వైనం చూస్తే.. మనం ఎక్కడికి వెళుతున్నాం.. ఎటు పోతున్నామన్న భావన కలగటం ఖాయం.

తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకున్న ఉదంతం చూస్తే.. ఉలిక్కిపడటమే కాదు.. కాసేపు ఊపిరి ఆడనట్లుగా ఫీలయ్యే పరిస్థితి. భార్యను.. కుమార్తెను చంపేయాలని చెప్పటమే కాదు.. ఎలా చంపాలన్న విషయాల్ని ఫోన్లో సలహాలు ఇవ్వటమే కాదు.. భయంగా ఉంది నాన్న అంటే.. నువ్వు చంపకపోతే నేను చచ్చిపోతా అంటూ బెదిరించిన వైనం చూస్తే.. కన్నకొడుకు చేత ఇలాంటి పాడు పనులు చేసే తండ్రులు కూడా ఉంటారా? అన్న భావన కలగటం ఖాయం.

ఈ నెల 25న రామచంద్రపురంలో జంట హత్యలు వెలుగు చూశాయి. ఈ హత్యల్ని చేధించారు పోలీసులు. ఈ సందర్భంగా పోలీసులు వెల్లడించిన వివరాలు చూస్తే అవాక్కు అవ్వటమే కాదు.. ఒళ్లు జలదరింపునకు గురి కావటం ఖాయం. దాదాపు 19 ఏళ్ల క్రితం రావులపాలెనికి చెందిన శ్రీనివాస్ కు అదే ప్రాంతానికి చెందిన మాధవితో పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. ఒక కుమార్తె.. కుమారుడు. కుమార్తె కరుణకు 18 ఏళ్లు కాగా.. కుమారుడికి పదహారేళ్లు. ఇదిలా ఉంటే కొన్నేళ్ల క్రితం కుమారుడ్ని తీసుకొని కాకినాడలోని ఒక హోటల్లో పని చేస్తున్నాడు శ్రీనివాస్.

అక్కడే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. తన మొదటి భార్య తనను చేతబడి చేసి చంపుతానని బెదిరిస్తుందని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. ప్రతి శనివారం కాకినాడలోని తన తండ్రి దగ్గర నుంచి రామచంద్రాపురంలోని తన తల్లి వద్దకు వెళ్లేవాడు మైనర్ కొడుకు. చదువుకునే వయసులో మీ నాన్న హోటల్లో పనిలో పెట్టాడు. నీ భవిష్యత్తు పాడైపోతుంది.. మీ నాన్న చస్తే కానీ మన కుటుంబం బాగుపడదని కొడుకుతో తల్లి అనేది. ఈ మాటలు కొడుకు ద్వారా విని శ్రీనివాస్ ఆగ్రహంతో రగిలిపోయేవాడు. తానంటే పిచ్చి ప్రేమ చూపించే కొడుకుతో.. వాళ్లు నన్ను చంపేస్తే నువ్వు.. మీ పిన్ని (సవితి తల్లి) అనాథలైపోతారు. మీరేమైపోతారన్న ఆవేదన వ్యక్తం చేస్తూ.. అదే నువ్వు మీ అమ్మను.. అక్కను చంపేస్తే మనమంతా హ్యాపీగా ఉండొచ్చంటూ కొడుకుతో అనేవాడు.

ఆ మాటలు మైనర్ కొడుకు మీద ప్రభావం చూపించటమే కాదు.. తల్లిని.. అక్కను చంపే ప్లాన్ చేశాడు.  24న రామచంద్రాపురానికి వచ్చిన కొడుకు.. అర్థరాత్రి వేళ.. తల్లి.. అక్క నిద్రపోతుండగా వారిని చంపే ప్రయత్నం చేసి.. భయంతో తండ్రికి ఫోన్ చేశాడు. చంపాలంటే భయంగా ఉందన్నాడు. దానికి బదులుగా.. నువ్వు చంపకపోతే.. నేను.. మీ పిన్ని చనిపోతామని బెదిరించటమే కాదు.. వంటింట్లో ఉన్న సుత్తితో కొట్టి చంపాలని.. అరుపులు వినిపించకుండా నోట్లో గుడ్డలు కుక్కాలని సలహా ఇచ్చాడు

తండ్రి మాటల మాయలో పడిపోయిన కొడుకు.. అతడు చెప్పినట్లే తల్లిని.. అక్కను అతి దారుణంగా చంపేశాడు. అనంతరం ఆధారాలు లభించకుండా ఏం చేయాలో కొడుక్కి సలహాలు ఇచ్చాడు తండ్రి. అయితే.. పోలీసుల విచారణలో ఈ మిస్టరీని ఛేదించి.. అసలేం జరిగిందో వివరాలు బయటకు తీసుకొచ్చారు. కుటుంబంలో అన్యోన్యతలు కరువై.. స్వార్థంతో తన వాళ్లను చంపేసుకుంటున్న తీరు భయం కలిగించటమే కాదు.. మనం ఎటు పోతున్నామన్నది ఒక పట్టాన అర్థం కాని రీతిలో తయారైందని చెప్పక తప్పదు.

కొసమెరుపు ఏంటంటే... సొంత కుటుంబ సభ్యుల హత్యలకు కారణాలన్నీ ఆరా తీస్తే మూడే మూడు ఉంటున్నాయి. ఒకటి అక్రమ సంబంధాలు, రెండోది ఆస్తి వివాదాలు, మూడోది గృహహింస.


Tags:    

Similar News