ఉద్యోగుల్లో కొత్త ట్రెండ్..క్వైట్ క్విట్టింగ్

Update: 2022-08-23 23:30 GMT
కోవిడ్-19 ప్రపంచంలో ఉద్యోగుల తీరునే మార్చేసింది. కోవిడ్ దెబ్బకు ప్రపంచంలోని చాలా దేశాల  ఆర్థిక పరిస్థితులు తల్లకిందులైపోయాయి. దీని ఫలితంగా సుమారు 11 కోట్ల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇదే సమయంలో సుమారు 4 కోట్లమంది తమంతట తాముగానే ఉద్యోగాలను వదిలేశారు. ఇదంతా కోవిడ్ ఎఫెక్టనే చెప్పాలి. అయితే పై రెండు విధానాలకు కొనసాగింపుగా కొత్తగా క్వైట్ క్విట్టింగ్ అనే విధానం ఊపందుకుంటోంది.

క్వైట్ క్విట్టింగ్ అంటే ఉద్యోగం వదిలేయటం కాదు. పేరులోనే ఉన్నట్లు తమ బాధ్యతలను తప్ప ఇతరత్రా మరే బాధ్యతలను తీసుకోవటానికి ఉద్యోగులు ఇష్టపడకపోవటం. ఉదాహరణకు ఒక ఉద్యోగిని అకౌంట్స్ వ్యవహారాలు చూసుకోవటానికి ఎకౌంటెంట్ గా తీసుకున్నదని అనుకుందాం. సదరు ఉద్యోగి సంస్ధ ఎకౌంట్లు మాత్రమే చూసుకోవాలి. కానీ కొంతకాలమైన తర్వాత ఉద్యోగికి యాజమాన్యం అనేక అదనపు బాధ్యతలను కూడా అప్పగిస్తుంటుంది.

యాజమాన్యం చర్యల వల్ల ఆ ఉద్యోగికి భారం పెరిగిపోతుంటుంది. అయితే బాధ్యతలు పెరిగిపోయినా జీతం మాత్రం పెరగదు. గట్టిగా మాట్లాడితే ఉద్యోగమే పోతుందేమో అనే భయంతో నోరుమూసుకుని పనిచేసుకుంటాడు. ఇపుడు క్వైట్ క్విట్టింగ్ పద్దతిలో అదనపు బాధ్యతలు తీసుకోవటానికి ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీల్లోని ఉద్యోగులు ఇష్టపడటంలేదట.

యాజమాన్యం ఎక్కువగా మాట్లాడితే ఉద్యోగాలు మానేయటానికి కూడా రెడీగా ఉన్నారట. దాంతో యాజమాన్యాలు అదనపు బాధ్యతలు అప్పగించటానికి వెనకాడుతున్నాయట.

దీనికి ప్రధాన కారణాలు ఏమిటంటే జీతాలు పెరగకపోవటం, పనిభారం వల్ల కుటుంబజీవితానికి దూరమైపోతుండటం, దానివల్ల ఇంట్లో గొడవలు. ఆఫీసులో బాధ్యతలు పెరిగిపోయి, ఇంట్లో గొడవల వల్ల ఉద్యోగుల్లో మానసిక సమస్యలు మొదలవుతున్నాయి.

అందుకనే ఆఫీసుపని, కుటుంబజీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలని ఉద్యోగులు డిసైడ్ అయ్యారట. ప్రధానంగా ఐటి, టూరిజం, ఫైనాన్స్, పరిశ్రమల రంగాల్లో క్వైట్ క్విట్టింగ్ ట్రెండ్ బాగా పెరిగిపోతోందని చాలాదేశాల్లోని అధ్యయన సంస్ధలు చెబుతున్నాయి.
Tags:    

Similar News