పేరులో ‘ఐసిస్’.. ఫేస్ బుక్ బ్లాక్

Update: 2015-11-19 04:08 GMT
‘‘మై నేమ్ ఈజ్ ఖాన్. బట్ ఐమామ్ నాట్ ఏ టెరర్రిస్ట్’’ అంటూ కొన్నేళ్ల ముందు బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ తన సినిమాలో ఒక డైలాగ్ చెబుతాడు. ‘మై నేమ్ ఈజ్ ఖాన్’’ చిత్రంలో ఈ డైలాగ్  చాలా పాపులర్. ఉగ్రవాదుల చర్యలతో అమెరికాలో చోటు చేసుకున్న పరిస్థితిని నిశితంగా విమర్శిస్తూ.. ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్ గా నిలిచింది. తాజాగా ‘‘ఐసిస్’’ అన్న పేరు కనిపిస్తే చాలా అంతా అలెర్ట్ అయిపోవటం ఒక ఎత్తు అయితే.. సోషల్ మీడియాలో ఆ పేరు కనిపిస్తే చాలు.. వెనుకా ముందు చూడకుండా బ్లాక్ చేసేయటం ఈ మధ్యన ఓ అలవాటుగా మారిందని వాపోతున్నారు.

తాజాగా శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అమ్మాయి ఫేస్ బుక్ అకౌంట్ బ్లాక్ అయిపోయింది. జరిగిందేమిటో ఆమెకు అస్సలు అర్థం కాలేదు. తన ఫేస్ బుక్ పేజీని పునరుద్దరించుకోవటం కోసం మూడుసార్లు ప్రయత్నించి విసిగిపోయిన ఈ అమ్మడికి అర్థమైందేమంటే.. తన పేరులో ఉన్న ‘ఐసిస్’ అన్న పదమే తన ఫేస్ బుక్ పేజీ బ్లాక్ కావటానికి కారణంగా అర్థం చేసుకొని.. మరోసామాజిక నెట్ వర్క్ అయిన ట్విట్టర్లో తన ఆవేదనను వ్యక్తం చేసింది.

పేరులో ఐసిస్ అని ఉంటే.. ఇలా ఫేస్ బుక్ బ్లాక్ చేస్తారా అంటూ ట్వీట్లు చేయటంతో ఆమె ఆవేదన ప్రపంచానికి తెలిసొచ్చింది. ఇంతా చేస్తే ఈ ఐటీ ఇంజనీర్ పేరు.. ‘‘ఐసిస్ అన్ షలీ’’. ఇస్లామిక్ స్టేట్ షార్ట్ కట్ లో ‘‘ఐసిస్’’గా వ్యవహరిస్తున్న ఈ ఉగ్రవాద సంస్థ ఇటీవల ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో ఉగ్రదాడికి పాల్పడిన నేపథ్యంలో.. ప్రపంచ వ్యాప్తంగా ఐసిస్ అన్న పేరు వినిపిస్తేనే ఉలిక్కిపడే పరిస్థితి. తమదైన ఉగ్రవాద కార్యకలాపాల్లో ప్రపంచానికి వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఈ రాక్షసుల పట్ల అందరూ జాగరూకతో ఉంటున్న పరిస్థితి.

అలా అని పేరులో ఐసిస్ అని ఉంటే ఈ రకంగా ఇబ్బంది పెట్టటం ఎంతవరకూ సబబు అని ‘ఐసిస్ అన్ షలీ’ ప్రశ్నిస్తోంది. పేరులో ఐసిస్ అని ఉంటే ఉగ్రవాది అయిపోతారా? అని నిలదీస్తున్న ఆమె.. తన ఖాతా పునరుద్దరణ కోసం ఫేస్ బుక్ కు తన పాస్ పోర్ట్ నకలు కాపీని స్క్రీన్ షాట్లు తీసి మరీ పంపానని.. అయినప్పటికీ ఖాతాను రీ ఓపెన్ చేయలేదంటూ అగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఐసిస్ అన్ షలీ ట్వీట్ ఇప్పుడు పలువురిని ఆకర్షిస్తోంది. పెద్ద ఎత్తున నెటిజన్లు స్పందించేలా చేస్తోంది. ఎంత పేరులో ఐసిస్ అని ఉంటే మాత్రం ఇంతలా చేస్తారా? ఐసిస్ అన్న పేరు ఉన్న వారంతా ఉగ్రవాదులే అంటూ అవమానించటం సబబు కాదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మొదలైన ఆన్ లైన్ రచ్చ ఫేస్ బుక్ దృష్టికి వెళ్లింది. ఆ యువతికి ఆన్ లైన్ లో పెరుగుతున్న మద్దుతు.. ఫేస్ బుక్ మీద వెల్లువెత్తుతున్న విమర్శలతో కళ్లు తెరిచిన ఎఫ్ బీ.. ఎట్టకేలకు ఆమె ఫేస్ బుక్ ఖాతాను రీ ఓపెన్ చేసింది. ‘‘ఐసిస్ అన్ షలీ’’ ఖాతాను పునరుద్దరించటమే కాకుండా.. జరిగింది తప్పేనని.. తమను క్షమించాలంటూ లెంపలేసుకోవటంతో ఈ వివాదం అక్కడితో సద్దుమణిగింది. చూస్తుంటే.. ఐసిస్ అన్న పేరు ఉన్న వారంతా తమను తాము పరిచయం చేసుకునే సమయంలో ‘‘మై నేమ్ ఈజ్ ఐసిస్.. బట్ ఐమాయ్ నాట్ ఏ టెరర్రిస్ట్’’ అని చెప్పుకోవాలేమో..?
Tags:    

Similar News