కరోనా కన్నీటి దృశ్యం..పచ్చని పందిట్లో తాళి కట్టాల్సిన వరుడు కడతేరిపోయాడు...

Update: 2020-08-07 01:30 GMT
కళ్ళు చెమర్చే కరోనా కన్నీటి దృశ్యమిది. పచ్చని పందిట్లో వధువు మెడలో మూడు  ముళ్ళు వేయాల్సిన వరుడు కరోనాతో మృతి చెందాడు.అత్యంత తీవ్ర విషాదం నింపిన ఈ సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.

ఆదోనిలోని 11వ వార్డుకు చెందిన యువకుడి(28)కి కొద్ది రోజుల కిందట నిశ్చితార్ధం జరుగగా ఈ నెల 6వ తేదీన పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. అందుకు ఇరు కుటుంబాల వారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బంధువులు, మిత్రులకు పెళ్లి కార్డులు పంచేసారు. ఈ నేపథ్యంలో గత నెల 28వ తేదీన జ్వరంగా ఉండటంతో తీరిక లేని పనుల కారణంగా నలతగా ఉందేమోనని ఆ యువకుడు భావించాడు. అయినా పరిస్థితి అలాగే ఉండటంతో కరోనాను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు చేయించుకోవడమే మేలనుకున్నాడు. స్థానికంగా ఓ ఏఎన్ఎంను కలసి నమూనాలు ఇచ్చాడు. ఆ ఫలితాలు రాకముందే అతడి పరిస్థితి విషమించడంతో కుటుంబీకులు హైదరాబాద్ కు తరలించారు. అక్కడ చికిత్స ఫలించక ఆ యువకుడు మంగళవారం రాత్రి మరణించాడు. తెల్లవారితే బుధవారం పచ్చని పెళ్లి పందిట్లో వధువు మెడలో తాళి కట్టాలిసిన వాడు కడతేరిపోయాడు. ఈ విషాద సంఘటన పెళ్లి అన్ని ఏర్పాట్లు చేసుకున్న వరుడి ఇంటా, మెట్టింటికి అడుగు పెట్టేందుకు గంపెడాశలతో ఎదురు చూస్తున్న పెళ్లి కూతురింట తీవ్ర విషాదాన్ని నింపింది. కరోనా తీవ్రతరం అయినప్పటి నుంచి ఇటువంటి ఘటనలు అధికమవడం ఆందోళన కలిగిస్తోంది.
Tags:    

Similar News